.webp)
.webp)
మనం చూసే సినిమాలు మారొచ్చు...హీరోలు మారొచ్చు...టెక్నాలజీ మారొచ్చు...కానీ తెరపై దేవుడు కనిపించగానే రెండు చేతులు జోడించి నమస్కరించే తెలుగు ప్రేక్షకుడి మనసు మాత్రం ఎప్పటికీ మారదు. ఎందుకంటే తెలుగు సినిమా అమ్ముల పొదిలో పౌరాణిక రసం దాగి ఉంది.అసలు తెలుగు సినిమా పునాదుల్లోనే పౌరాణిక చిత్రాల పాత్ర ఉంది. మూకీ చిత్రాల కాలం నుంచే పురాణ కథలు తెరపై కనిపించాయి. టాకీ సినిమాలు వచ్చిన తర్వాత... నాటకాల ప్రభావం కూడా సినిమాలపై బలంగా కనిపించింది. అప్పట్లో పౌరాణిక పాత్ర అంటే.. పెద్ద పెద్ద పద్యాలు. శ్లోకాలు,గంభీరమైన సంభాషణలు. కానీ పౌరాణిక రోల్ అంటే కేవలం నటించడం కాదు. ప్రేక్షకులు నమ్మేలా చేయొచ్చని నిరూపించిన మహానటుడు ఎవరు?
ఇంకెవరు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. దేవుళ్లను చూసే ప్రేక్షకుల దృష్టినే మార్చారు. శ్రీకృష్ణుడిగా ఆయన నవ్వితే.. కృష్ణుడు ఇలాగే ఉంటాడేమో! అనిపించేది. శ్రీరాముడిగా కనిపిస్తే. ఆ కరుణ, ఆ ప్రశాంతత ప్రేక్షకుల మనసులను తాకేది. అదే సమయంలో రావణుడిగా గర్జించినా.. దుర్యోధనుడిగా రాజసం చూపించినా... వాటికి ఒక ప్రత్యేకమైన గంభీరతని తీసుకురావడం ఎన్టీఆర్ గారి ప్రత్యేకత! మాయాబజార్', శ్రీకృష్ణ పాండవీయం', దాన వీర శూర కర్ణ' సినిమాల్లో ఆయన నటన ఇప్పటికీ ఒక పాఠ్యపుస్తకంలాంటిదే! గంభీరమైన డైలాగ్ డెలివరీ, రాచరికపు నడక. అద్భుతమైన హావభావాలు..ఇవన్నీ కలిపి పౌరాణిక పాత్రకు ఒక కొత్త డెఫినిషన్ ఇచ్చారు ఎన్టీఆర్ గారు.
అయితే పౌరాణిక సినిమాల్లో హీరో మాత్రమే కాదు.. రాక్షస పాత్రలు, ప్రతినాయక పాత్రలు కూడా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవచ్చని నిరూపించిన నటుడు విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ ఎస్. వి. రంగారావు గారు! మాయాబజార్'లో ఘటోత్కచుడిగా ఆయన చేసిన విన్యాసాలు చూస్తే ఇప్పటికీ నవ్వు ఆపుకోవడం కష్టమే! అదే 'భక్త ప్రహ్లాద'లో హిరణ్యకశిపుడిగా ఆయన చూపించిన రౌద్రం...
ఆ గంభీరమైన స్వరం.. అది ఎస్వీఆర్ గారి నటనకు ఉన్న పవర్! నాయకుడికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. ప్రతినాయకుడికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వొచ్చని, విలనిజానికి గ్రాండ్‌నెస్ తీసుకొచ్చారు ఎస్వీఆర్.
ఇక యముడంటే! అంటే ఎలా ఉంటాడు? అని చూసుకుంటే చాలామందికి ఒక భయంకరమైన రూపమే గుర్తొస్తుంది. కానీ యముడిని భయపెట్టే పాత్రగానే కాకుండా... ప్రేక్షకులను నవ్వించే పాత్రగా కూడా చూపించొచ్చని నిరూపించారు కైకాల గారు. అందుకు సాక్ష్యం 'యమగోల'లోని యముడి పాత్ర... పౌరాణికాన్ని సోషియో ఫాంటసీ వైపు తీసుకెళ్లిన ఒక ముఖ్యమైన మలుపుగా కూడా చెప్పవచ్చు.
అదే సమయంలో ప్రేక్షకులు మెచ్చే పాత్రగా మార్చడం నిజంగా ప్రత్యేకమైన మార్పు. కాంతారావు గారు నారదుడిగా, గుమ్మడి గారు కర్ణుడిగా...జానపద, పౌరాణిక చిత్రాల్లో తమదైన ముద్ర వేశారు. మహిళా నటీమణుల్లో. సావిత్రి గారు శశిరేఖగా చేసిన నటన ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. అలాగే భానుమతి గారి గంభీరమైన నటన పౌరాణిక చిత్రాలకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! సినిమాల్లో కొత్త జానర్లు రావడంతో.. పౌరాణిక సినిమాల సంఖ్య క్రమంగా తగ్గింది. అయితే.. పౌరాణికం అంతరించిపోలేదు... కొత్త రూపంలో తిరిగి వచ్చింది! VFX... గ్రాఫిక్స్... సోషియో-ఫాంటసీ...ఇలాంటి కొత్త టెక్నాలజీలతో దేవుళ్ల మహిమలని ప్రేక్షకులకి సరికొత్తగా చూపించడం మొదలైంది. 'అమ్మోరు'...'దేవి'... లాంటి సినిమాలు ఈ మార్పుకి మంచి ఉదాహరణలు.
బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం తొంబైలలో పౌరాణిక చిత్రాలకి సరికొత్త ఊపిరి ఇచ్చాయి. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన 'అన్నమయ్య'... 'శ్రీరామదాసు' , ఓం నమో వెంకటేశాయ..
బాలకృష్ణ, రాఘవేంద్రరావుల పాండురంగ మహత్యం, బాలకృష్ణ బాపుల శ్రీరామరాజ్యం తెలుగు సినిమా పౌరాణిక సువాస పరిమళాల్ని వెదజల్లాయి. పౌరాణికం అంటే కేవలం పాత కథ కాదు...ఆ కథను నేటి ప్రేక్షకుడికి ఎలా చెప్పాలి?అనే ఆలోచనకి ఈ సినిమాలు కొత్త దారి చూపించాయి.
ఇక నేటి తరానికి వస్తే...దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి గారు పౌరాణిక కథల స్ఫూర్తిని తీసుకుని...
'బాహుబలి'...'ఆర్ఆర్ఆర్'...లాంటి సినిమాలతో భారతీయ కథనాన్ని ప్రపంచ ప్రేక్షకులకి పరిచయం చేశారు.
ఇక్కడ ఒక ముఖ్యమైన మార్పు ఏంటంటే...పౌరాణిక కథల్లో కనిపించే వీరత్వం, భావోద్వేగం, త్యాగం, ధర్మం వంటి అంశాలను ఆధునిక విజువల్స్‌తో కలిపి చూపించడం. అంటే...కథ పాతదైనా... చెప్పే విధానం మాత్రం కొత్తది! కల్కి 2898 AD' విషయానికి వస్తే. మహాభారత కాలానికి సంబంధించిన అంశాలను తీసుకుని వాటిని భవిష్యత్తు ప్రపంచం, సైన్స్ ఫిక్షన్‌తో కలిపి చూపించింది.
ఇప్పుడు 'వారణాసి' కూడా భారతీయ ఇతిహాసాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించబోతుంది. అంటే...
పురాణం ఒక వైపు...భవిష్యత్తు మరో వైపు...ఈ రెండింటినీ కలిపిన కొత్త తరహా ప్రపంచం! మరి మొత్తం ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే...
పద్యాల కాలం నుంచి...ఎన్టీఆర్ గారి దైవిక రూపాల వరకు...ఎస్వీఆర్ గారి రాక్షస పాత్రల వరకు...
కైకాల గారి యముడి వరకు...VFX, సోషియో-ఫాంటసీ వరకు...అక్కడి నుంచి గ్లోబల్ విజువల్ వండర్స్ వరకు...తెలుగు పౌరాణిక సినిమా ఎన్నో రూపాలు మార్చుకుంది.
కానీ...కథలు మారినా...హీరోలు మారినా...టెక్నాలజీ మారినా...మన పురాణాల్లోని ఆత్మ మాత్రం మారలేదు! మన సంస్కృతి...మన సంప్రదాయం... మన దేవుళ్లపై ఉన్న నమ్మకం...ఇవన్నీ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సజీవంగానే ఉన్నాయి!
అందుకే...
తెలుగు సినిమాలో పౌరాణికం ఒక జోనర్ మాత్రమే కాదు...
అది మన సంస్కృతితో ముడిపడిన భావోద్వేగం!..





