
తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ కామెడీ క్వీన్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు కోవై సరళ. తనదైన విలక్షణమైన గొంతు, ఊహించని నటన, పంచ్ డైలాగులతో ప్రేక్షకులను నవ్వుల తీరాల్లో ముంచెత్తడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా తెలుగువన్ (TeluguOne) వేదికగా విడుదలైన ఒక ప్రత్యేక కామెడీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కోవై సరళ తనదైన మార్క్ గయ్యాలితనంతో ఇద్దరు భర్తలను ఎలా వణికించింది, అసలు ఆమె భరతం పట్టలేక పారిపోయిన మొదటి భర్త సన్యాసి రూపంలో ఎలా తిరిగొచ్చాడనే కథాంశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. బ్రహ్మచారినని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్న ఒక అమాయకపు రెండో భర్తను, తన గయ్యాళి తనంతో ముప్పితిప్పలు పెట్టే సీన్లతో ఈ కామెడీ ఎపిసోడ్ సాగుతుంది.
ఈ కథలోకి వెళితే, కోవై సరళకు ఆల్రెడీ పెళ్లయి ఒక కొడుకు కూడా ఉంటాడు. కానీ ఆమె పెట్టే టార్చర్‌ను భరించలేక మొదటి భర్త సత్తిబాబు ఎప్పుడో ఇల్లు వదిలి పారిపోతాడు. దీంతో ఆమె తమ్ముడు(ఎల్.బి. శ్రీరామ్).. తన ఆఫీస్ లో బ్రహ్మచారిగా ఉన్న వామన్రావు (ఎం.ఎస్. నారాయణ) అనే ఒక అమాయకుడిని పట్టుకొచ్చి, తన అక్కకు పెళ్లి కాలేదంటూ అబద్ధం చెప్పి మరీ రెండో పెళ్లి జరిపిస్తాడు. శోభనం గదిలోకి వెళ్ళిన తర్వాత కోవై సరళ "అదే పట్టు.. అదే పట్టు" అంటూ వింతగా ప్రవర్తించడంతో ఆ రెండో భర్త తీవ్ర గందరగోళానికి గురవుతాడు. పైగా పెళ్లయిన వెంటనే ఒక కుర్రాడు వచ్చి 'డాడీ డాడీ' అని పిలవడంతో, తనకు జరిగింది ఘోరమైన మోసమని గ్రహిస్తాడు. ఒక రెడీమేడ్ పిల్లాడితో సహా పెళ్లాం దొరికినందుకు సంతోషించాలో, లేక ఈ గయ్యాళి భార్య చేతిలో బుక్కయినందుకు ఏడవాలో తెలియక ఆ రెండో భర్త సతమతమవుతాడు.
భార్య పెట్టే బాధలు భరించలేక ఆ రెండో భర్త కూడా ఇల్లు వదిలి పారిపోవాలని డిసైడ్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో ఇంటి ముంగిట ఒక సన్యాసి ప్రత్యక్షమవుతాడు. సంసార జీవితాన్ని భరించలేక తాను సన్యాసిగా మారాను అని ఆ సాధువు చెప్పడంతో, ఈ రెండో భర్త కూడా తనను తన సన్యాసి టీంలో జాయిన్ చేసుకోమని, ఎక్స్ట్రాగా పడి ఉంటానని కాళ్లవేళ్ల పడతాడు. అయితే అక్కడే ఒక ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. ఆ సన్యాసి మరెవరో కాదు, గతంలో కోవై సరళ టార్చర్ తట్టుకోలేక సలూన్‌కు వెళ్లి గడ్డం గీయించుకొస్తానని చెప్పి పారిపోయిన ఆమె మొదటి మొగుడు సత్తిబాబు. ఎన్నో ఏళ్ల తర్వాత అంత పొడుగు గడ్డంతో భర్త ప్రత్యక్షం కావడంతో కోవై సరళ ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది.
చివరగా ఆ మొదటి భర్త అయిన సన్యాసి, రెండో భర్తతో "నువ్వు అదృష్టవంతుడివి, నేను దురదృష్టవంతుడిని. నేను పారిపోయి సన్యాసిని అయ్యాను, నువ్వు సంసారం కోసం సన్నాసివయ్యావు. ఈమెకు నువ్వు కాకపోతే ఇంకొకడు దొరుకుతాడేమో కానీ, మా సన్యాసి మఠంలో మాత్రం వీడికి ఎలాంటి వేకెన్సీ లేదు" అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి జారుకుంటాడు. మొదటి భర్త మాటలతో రియలైజ్ అయిన కోవై సరళ, ఇకపై బుద్ధిగా ఉంటానని, ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందామని రెండో భర్తకు దండం పెట్టడంతో ఈ నవ్వుల హంగామా ముగుస్తుంది. కోవై సరళ మార్క్ టైమింగ్, డైలాగ్ డెలివరీతో సాగిన ఈ కామెడీ వీడియోను తెలుగువన్ (TeluguOne) అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో ప్రేక్షకులు వీక్షించవచ్చు.
Kovai Sarala, Comedy Scenes, MS Narayana, LB Sriram





