Home

»

Exclusive Movie News

'కొరియన్ కనకరాజు' కాంట్రవర్సీ: అమెచ్యూరిష్ డైలాగ్.. అఖండ గెటప్.. ముందే ప్లాన్ చేశారా.?

Aug 13, 2026 11:26AM

వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'కొరియన్ కనకరాజు'. ఈ హారర్ కామెడీ ఫిల్మ్ లో కమెడియన్ సత్య, సీనియర్ ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేస్తూ "అమెచ్యూరిష్" అనే డైలాగ్ చెప్పడం వివాదాస్పదమైంది. సినిమా రిలీజ్ కి సరిగ్గా పదిరోజుల ముందు ఆ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఎన్టీఆర్ ను కావాలనే ట్రోల్ చేశారనే విమర్శలు వచ్చాయి. అయితే ఈ వివాదంపై తాజాగా 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు మేర్లపాక గాంధీ క్లారిటీ ఇచ్చారు. తాము ఎవరినీ కించపరచడానికి ఈ సన్నివేశాన్ని పెట్టలేదని చెప్పారు.

ఈ వివాదాస్పద సన్నివేశాన్ని గత ఏడాది నవంబర్ నెలలోనే చిత్రీకరించామని మేర్లపాక గాంధీ వెల్లడించారు. ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్న వీడియోను చూసి, కేవలం సరదాగా నటుడు సత్యతో కలసి ఆ ఇమిటేషన్ చేశామని ఆయన తెలిపారు. సాధారణంగా సినిమాలో చిరంజీవి, షారుఖ్ ఖాన్, మోహన్ బాబు వంటి ప్రముఖ నటులను ఇమిటేట్ చేసినట్లే, ఇది కూడా ఒక చిన్న సరదా ప్రయత్నమే తప్ప ఎవరినీ తక్కువ చేసి చూపించే ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. 

సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న సమయంలోనే అనుకోకుండా ఈ "అమెచ్యూరిష్" డైలాగ్ మళ్లీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిందని, దానికి తమ సినిమా ప్రచారానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాము ప్లాన్ చేసి, సినిమా రిలీజ్ కి ముందు ట్రెండ్ చేయలేదని చెప్పారు.

సినిమా విడుదల సమయానికి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ రావడం ఆలస్యమైందని, ఆ ఒత్తిడిలో పబ్లిసిటీ స్టంట్లు ఆలోచించే తీరికే తమకు లేదని గాంధీ పేర్కొన్నారు. ఆగస్టు 7న సినిమా విడుదల కానుండగా, ఆగస్టు 6 ఉదయం వరకు కూడా థియేటర్ కాపీలను అప్‌లోడ్ చేస్తూ ఉన్నామని ఆయన వెల్లడించారు.

ఇక సినిమాలో మురళీధర్ గౌడ్ పాత్ర గెటప్ 'అఖండ' చిత్రంలోని బాలకృష్ణ పాత్రను పోలి ఉందనే వార్తలపై స్పందిస్తూ.. అది కూడా ప్లాన్ చేసింది కాదని, యాదృచ్ఛికమేనని తెలిపారు. సినిమాలో ఆయన భూత వైద్యుడి పాత్ర పోషించారని, కావాలని ఎవరినీ అనుకరించలేదని మేర్లపాక గాంధీ చెప్పారు. 

 

 

Korean Kanakaraju, Amateurish Dialogue, Controversy, Merlapaka Gandhi, Interview

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com