Home

»

Exclusive Movie News

‘దమ్ మసాలా’ సాంగ్ అర్థం తెలుసా?.. మహేష్ పాత్రను ముందే చెప్పిన త్రివిక్రమ్.!

Oct 7, 2026 7:35PM

‘గుంటూరు కారం’ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ముందుగా గుర్తొచ్చే పాటల్లో ‘దమ్ మసాలా’ ఒకటి. మహేష్ బాబు మాస్ అవతార్‌ను చూపిస్తూ వచ్చిన ఈ పాట మ్యూజిక్ పరంగా మాత్రమే కాదు.. లిరిక్స్ పరంగా కూడా బాగా ఆకట్టుకుంది. 

‘దమ్ మసాలా’లో మహేష్ పాత్ర స్వభావం, అతని ఆటిట్యూడ్, అతని స్వేచ్ఛా మనస్తత్వం.. చివరికి అతని లోపల ఉన్న బాధ కూడా కనిపిస్తుంది. పాట మొదటి నుంచి చివరి వరకు మిరపకారం, బిర్యానీ వంటి గుంటూరు నేటివిటీ పదాలతో సాగినా.. మధ్యలో మాత్రం చాలా డీప్ లైన్స్ వస్తాయి.

మొదట్లోనే ‘గొడ్డు కారం’తో మహేష్ పాత్రను పోల్చడం కనిపిస్తుంది. గుంటూరు అంటే మిరపకారం గుర్తొస్తుంది. ఆ కారం ఎంత ఘాటుగా ఉంటుందో.. ఈ పాత్ర కూడా అంతే ఘాటుగా ఉంటుందని చెప్పే ప్రయత్నం ఇది.

ఇక పట్టాభిపురం, బుర్రిపాలెం పేర్లు రావడం కూడా చాలా స్పెషల్. ఇవి కేవలం రైమింగ్ కోసం పెట్టిన పదాలు కావు. గుంటూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మహేష్ పాత్రకు ఒక లోకల్ ఐడెంటిటీని బలంగా ఇస్తాయి. ‘బుర్రిపాలెం బుల్లోడు’ అంటే ఎవరికీ తెలియని వ్యక్తి కాదన్నట్టుగా అతని క్రేజ్‌ను ఎలివేట్ చేస్తుంది.

ఇక "ఏ లెక్కలు ఎవడికి చెప్పాలి
ఏ హక్కులు ఎవడికి రాయాలి
ఎవడెవడో వేసిన బరువు
ఎందుకు ఎందుకు నే మొయ్యాలి" 

అనే భావం వచ్చే లైన్లు మహేష్ పాత్రలోని మరో కోణాన్ని బయటపెడతాయి.

ఇక్కడ ‘బరువు’ అంటే కేవలం ఏదో భౌతికమైన బరువు కాదు. ఇతరులు తనపై మోపిన బాధ్యతలు, అంచనాలు, సమస్యలు కావొచ్చు. ఇతరుల జీవితాల భారాన్ని నేను ఎందుకు మోయాలి? నా జీవితం నేను ఎందుకు నా ఇష్టం వచ్చినట్టు జీవించకూడదు? అనే తిరుగుబాటు మనస్తత్వం ఈ లైన్లలో కనిపిస్తుంది.

ఇదే పాటలో మరో ముఖ్యమైన విషయం.

"నేనో నిశ్శబ్దం అనునిత్యం
నాతో నాకే యుద్ధం
స్వార్థం పరమార్థం కలగలిసిన
నేనో ప్రేమ పదార్థం"

ఇది చూస్తే బయటకు చాలా ఎనర్జిటిక్‌గా, ఎవరికీ భయపడని వ్యక్తిలా కనిపించే మహేష్ పాత్ర లోపల మాత్రం ఒక యుద్ధంతో ఉంటుందని అర్థమవుతుంది. అంటే ఇది కేవలం మాస్ క్యారెక్టర్ కాదు.. తన గతంతో, తన పరిస్థితులతో, తన చుట్టూ ఉన్న మనుషులతో పోరాడుతున్న వ్యక్తి.

ఇక ‘స్వార్థం, పరమార్థం కలగలిసిన నేనో ప్రేమ పదార్థం’ అనే భావన కూడా పాత్రను మరో కోణంలో చూపిస్తుంది. బయటకు రఫ్‌గా కనిపించినా.. లోపల ప్రేమను దాచుకున్న వ్యక్తి అన్న సూచన ఇందులో కనిపిస్తుంది.

ముఖ్యంగా ఈ పాట చివర్లో ఒక్కసారిగా ఎమోషన్‌లోకి తీసుకెళ్తారు.

“నా మనసే నా కిటికీ
నచ్చక పోతే మూసేస్తా
ఆ రేపటి గాయాన్ని
ఇపుడే ఆపేస్తా”

అంటే తన మనసులోకి ఎవరిని అనుమతించాలి? ఎవరిని దూరంగా ఉంచాలి? అనేది తానే నిర్ణయించుకుంటాడు. ఎవరైనా నచ్చకపోతే తన ప్రపంచానికి తలుపులు మూసేసే వ్యక్తి అన్నమాట. అలాగే, రేపు ఏదైనా జరిగి బాధపడటం కంటే.. అది తనను బాధించే అవకాశం ఉందని ముందే తెలుసుకుని దాన్ని తన జీవితంలోకి రానివ్వకుండా చేసుకోవడం.

మొత్తంగా చూస్తే.. ‘దమ్ మసాలా’ ఒక మాస్ సాంగ్‌లా కనిపించినా.. దాని లోపల మహేష్ పాత్రకు సంబంధించిన పూర్తి క్యారెక్టర్ స్కెచ్ కనిపిస్తుంది.

 

 

 

[Dum Masala Song Lyrics Telugu, Dum Masala Song Meaning, Dum Masala Full Song, Guntur Kaaram Songs, Mahesh Babu, Trivikram Srinivas, Thaman Songs, Telugu Songs]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com