
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మాస్ యాక్షన్ సినిమాలకు ఎంతటి క్రేజ్ ఉందో, ఆయన కెరీర్‌లో వచ్చిన కొన్ని ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్లకు కూడా అంతే ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన చిత్రం 'దేవుడు' (Devudu). రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ఇందులోని కొన్ని కామెడీ సన్నివేశాలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తూనే ఉంటాయి. తాజాగా ఈ సినిమాలోని ఒక ఐకానిక్ కామెడీ సీన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియో విషయానికి వస్తే.. ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao), తన ఇంట్లోనే కూర్చుని తీవ్రమైన ఆవేదన చెందుతూ ఉంటారు. అయితే ఆయన బాధ ఓడిపోయినందుకు కాదు.. అంతకంటే పెద్ద అవమానం ఇంట్లో జరిగిందని తల పట్టుకుంటారు. "మన ఇంట్లో ఉన్న ఓట్లు మూడు.. కానీ నాకు పడ్డ ఓట్లు మాత్రం రెండు. చెప్పండి, మీలో నన్ను మోసం చేసింది ఎవరు? నాకు ద్రోహం చేసి, వెన్నుపోటు పొడిచింది ఎవరు?" అంటూ కోట శ్రీనివాసరావు డైలాగ్స్ చెబుతుంటే నవ్వు ఆపుకోవడం ఎవరి తరమూ కాదు.
ఆ సమయంలో భార్య(వై. విజయ), కొడుకు(శివాజీ రాజా) వైపు అనుమానంగా చూస్తూ కోట చేసే హంగామా అంతా ఇంతా కాదు. భార్య వచ్చి తాను కట్టిన తాళిబొట్టు మీద, కన్న బిడ్డ మీద ఒట్టు వేసి తన ఓటు ఆయనకే వేశానని నమ్మిస్తుంది. ఇక మిగిలింది కొడుకు మాత్రమే. తండ్రిని ఎమ్మెల్యేను చేయడమే ధ్యేయంగా బతికిన తనను అనుమానించడం తట్టుకోలేక, కొడుకు ఎంతో ఎమోషనల్ అవుతూ డైలాగ్స్ అందుకోవడం ఈ సీన్ లోనే హైలైట్.
తనకు జన్మనిచ్చిన తండ్రి మీద ప్రమాణం చేసి.. గురి చూసి మరీ 'తొండ' గుర్తు మీద ఓటు వేశానని కొడుకు ఎంతో గంభీరంగా చెబుతాడు. అక్కడే అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. "మనది ఉడుత గుర్తు కదా" అని కోట అంటాడు. "ఒరేయ్ నా ఉడతలు పట్టే డాడీ. మనది ఉడత గుర్తు కాదు.. తొండ గుర్తు" అని అసలు మేటర్ చెబుతాడు. దాంతో తన ఓటు తానే వేసుకోలేదనే విషయం కోటాకు అర్థమవుతోంది.
కోట శ్రీనివాసరావు అద్భుతమైన టైమింగ్, అమాయకత్వంతో కూడిన నటన ఈ సీన్‌ను ఎవర్ గ్రీన్ కామెడీగా మార్చేశాయి. ఈ చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. రాజకీయాల్లో జరిగే కన్ఫ్యూజన్‌ను ఇంత కామెడీగా తెరకెక్కించడం కేవలం ఆ నాటి దర్శకులకు, నటులకే సాధ్యమైందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Nandamuri Balakrishna, Devudu Movie, Comedy Scenes, Kota Srinivasa Rao, TeluguOne





