Home

»

Exclusive Movie News

టైరాట ఆడుకుంటుంటే అరెస్ట్ చేశారు సార్.. పోలీస్‌ను బురిడీ కొట్టించిన దొంగ!

Jun 30, 2026 12:29PM

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam) సృష్టించిన నవ్వుల హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని దశాబ్దాలుగా ఆయన పండించిన కామెడీ సీన్లు ఇప్పటికీ మీమ్స్ రూపంలో, షార్ట్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా 'ఊయల' (Ooyala) సినిమాలోని బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుధాకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఒక అల్టిమేట్ కామెడీ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఈ వైరల్ వీడియోలో.. బ్రహ్మానందం ఒక టైర్ల షాప్ దగ్గర దొంగతనం చేయడానికి ప్లాన్ వేస్తాడు. తక్కువ ధరకు కార్ టైర్ ఇస్తానంటూ ఒక కస్టమర్‌తో డీల్ మాట్లాడుకుని, ఐదు నిమిషాల్లో టైర్ తెస్తానని చెబుతాడు. అన్నట్టుగానే పట్టపగలు షాప్ లోంచి టైర్ దొంగిలించి రోడ్డు మీదకు వస్తాడు. అయితే అక్కడే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సుధాకర్ కంట ఈ దొంగతనం పడిపోతుంది.

దొంగతనంగా టైర్ పట్టుకెళ్తున్న బ్రహ్మానందం.. ఆ టైర్‌ను రోడ్డు మీద దొర్లిస్తూ "టైరాట.. టైరాట.. నాకు ఇష్టం టైరాట" అంటూ చిన్నపిల్లాడిలా పరుగులు పెడతాడు. కానిస్టేబుల్ అయిన సుధాకర్ దొంగతనం చేసిన బ్రహ్మిని పట్టుకోవడానికి వస్తే.. పోలీస్ అని కూడా చూడకుండా సుధాకర్‌తో వాదనకు దిగి, ఇద్దరూ కలిసి స్టేషన్‌కు వెళ్తారు.

ఇక అసలైన నవ్వుల విందు పోలీస్ స్టేషన్‌లో మొదలవుతుంది. స్టేషన్‌లోకి అడుగుపెట్టగానే బ్రహ్మానందం తనదైన మార్క్ వినయం, విధేయత నటిస్తూ ఎస్ఐగా ఉన్న తనికెళ్ల భరణి మనసు గెలుచుకుంటాడు. "మీ కానిస్టేబుల్ గారు నా పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నాడు సార్" అంటూ రివర్స్ లో సుధాకర్ మీదే కంప్లైంట్ ఇస్తాడు.

"మీరు చిన్నప్పుడు సైకిల్ టైర్ ఆట ఆడుకోలేదా సార్? నాకు ఆ బాల్య స్మృతులు గుర్తొచ్చి టైరాట ఆడుకుంటుంటే ఈ కానిస్టేబుల్ అడ్డుపడ్డాడు" అంటూ భరణిని సెంటిమెంట్‌తో బురిడీ కొట్టిస్తాడు. బ్రహ్మానందం వినయానికి పడిపోయిన ఎస్ఐ.. కానిస్టేబుల్ సుధాకర్ మీద సీరియస్ అవుతూ, "టైరాట ఆడుకుంటే అడ్డుపడతావా? నీ మీద కేసు బుక్ చేస్తా" అని వార్నింగ్ ఇవ్వడం ఈ సీన్‌కే హైలైట్. ఆఖర్లో సుధాకర్ "వీడు దొంగతనం చేస్తుంటే పట్టుకున్నా సార్" అని మొత్తుకున్నా.. "అది తర్వాత సంగతి, ముందు నా పౌర హక్కుల కేసు సంగతి తేల్చండి" అంటూ బ్రహ్మానందం ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ నవ్వులు పూయిస్తాయి.

ఈ ఎవర్‌గ్రీన్ కామెడీ సీన్ ప్రస్తుతం యూట్యూబ్ షార్ట్స్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అప్పటి సినిమాల్లోని క్లీన్ కామెడీ, నటీనటుల టైమింగ్ ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటోందనడానికి ఈ వీడియోనే ఒక ఉదాహరణ.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com