
గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ(Balakrishna),సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)కాంబినేషన్ అనగానే టాలీవుడ్ ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది 'భగవంత్ కేసరి'. సరిగ్గా మూడేళ్ల క్రితం దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులని సృష్టించడమే కాకుండా, థియేటర్లలో నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించింది. దాదాపు 140 కోట్ల రూపాయల భారీ వసూళ్లతో బాలయ్య కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమా, కేవలం కమర్షియల్ సక్సెస్‌తోనే ఆగిపోలేదు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డు సొంతం చేసుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇలాంటి సెన్సేషనల్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ కాంబినేషన్ ఇప్పుడు మరోసారి రిపీట్ కాబోతోందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవితో చేసిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంతో 360 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, ఇప్పుడు బాలకృష్ణ కోసం ఒక నెక్స్ట్ లెవెల్ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. అనిల్ ఇటీవల బాలయ్యను కలిసి లైన్ వినిపించగా, కథలోని ఇంటెన్సిటీ నచ్చి బాలకృష్ణ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి నెట్టింట ప్రచారం సాగుతుండటంతో నందమూరి అభిమానుల్లో అప్పుడే అంచనాలు హై రేంజ్ లో ఏర్పడ్డాయి.
ప్రస్తుతం బాలకృష్ణ వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'వీరసింహారెడ్డి' వంద కోట్ల మార్క్‌ను దాటి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలోనూ బాలయ్య ఒక సినిమాకి పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ రెండు ప్రతిష్టాత్మక చిత్రాల షూటింగ్స్ పూర్తయిన తర్వాతే బాలయ్య, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి కూడా విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ మూవీతో బిజీగా ఉన్నారు.
అయితే ఈ కొత్త ప్రాజెక్ట్ 'భగవంత్ కేసరి' చిత్రానికి ప్రీక్వెల్‌గా రాబోతుందా లేక సరికొత్త మాస్ స్టోరీనా అనే చర్చ నడుస్తోంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ, 'భగవంత్ కేసరి' క్యారక్టర్ వెనుక ఉన్న అసలు గతం ఏమిటి, ఆయన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఎలా మారాడు అనే కోణంలో ఒక ప్రీక్వెల్ ఆలోచన ఉందని హింట్ ఇచ్చారు. బాలయ్య మార్క్ పవర్ ప్యాక్డ్ డైలాగ్స్, తెలంగాణ యాసతో కూడిన మాస్ ఎనర్జీకి అనిల్ రావిపూడి మార్క్ ఎమోషన్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక కాంబినేషన్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.





