
టాలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్. 'కలర్ ఫోటో', 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' వంటి చిత్రాలతో హీరోగా ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ నటుడు, నెగటివ్ రోల్స్ లోనూ మెప్పించారు. ఇప్పుడు ఒక తమిళ సినిమాలో సరికొత్త అవతారంలో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. సూరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం 'మండాడి'లో సుహాస్ నెగిటివ్ షేడ్స్ ఉన్న భయంకరమైన మెయిన్ విలన్ పాత్రను పోషించారు. ఇటీవల 'తెలుగువన్'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి, షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాల గురించి సుహాస్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా సినిమా టైటిల్ 'మండాడీ' అంతరార్ధం గురించి సుహాస్ వివరిస్తూ, రామేశ్వరం సమీపంలోని తొండి, రామనాథపురం పల్లెటూరు నేపథ్యంతో సాగే ఈ కథలో ఒక ప్రత్యేకమైన బోట్ రేస్ ప్రధానాంశంగా ఉంటుందని చెప్పారు. ఆ ఊరిలో జరిగే బోట్ రేస్‌లో లీడ్ చేసే కెప్టెన్‌ను స్థానికులు 'మండాడి' అని పిలుస్తారని తెలిపారు. గతంలో 'ఫ్యామిలీ డ్రామా' చిత్రంలో సైకో పాత్రలో తన నటనను చూసి దర్శకుడు ఈ క్రూరమైన విలన్ రోల్ కోసం తనను ఎంపిక చేశారని సుహాస్ వెల్లడించారు. హీరోగానే ఉండిపోకుండా నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలనే కోరికతోనే ఈ సినిమాలో పీకలు కోసేంత క్రూరమైన ప్రతినాయకుడిగా నటించడానికి అంగీకరించినట్లు పేర్కొన్నారు.
'మండాడి' సినిమా చిత్రీకరణ సుమారు 130 రోజుల పాటు జరిగిందని, అందులో కేవలం ఇంటర్వెల్ సీన్స్ కోసం 70 రోజులు, క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాల కోసం 45 రోజులు కేటాయించినట్లు సుహాస్ తెలిపారు. ముఖ్యంగా సముద్రం లోపల షూటింగ్ చేయడం సవాలుతో కూడుకున్న అనుభవమని చెప్పారు. ఒడ్డుకు దాదాపు 10 నుండి 15 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి, తీవ్రమైన అలలు, రఫ్ సీ మధ్య ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు పడవలపైనే గడిపినట్లు వివరించారు. ఈ క్రమంలో ఏకంగా 74 రోజుల పాటు సముద్రం మధ్యలోనే షూటింగ్ జరిగిందని, ఇది తమ జీవితంలోనే అత్యంత కష్టతరమైన ప్రయాణమని తెలిపారు.
ఈ షూటింగ్ సమయంలో ప్రాణాపాయ స్థితి నుండి పలుమార్లు చావు తప్పి బయటపడ్డామని సుహాస్ గుర్తుచేసుకున్నారు. సముద్రంలో బలమైన గాలులు వీచినప్పుడు పడవలు తీవ్రంగా ఊగిసలాడుతూ బోల్తా పడే పరిస్థితి వచ్చేదని, ఆ సమయంలో సరైన సమయానికి నీటిలోకి దూకకపోతే పడవ తమపైనే పడిపోయే ప్రమాదం ఉండేదని చెప్పారు. అంతేకాకుండా పెద్ద పెద్ద కర్రలు, వేగంగా తిరిగే బరువైన త్రాళ్లు ఒంటికి తగిలితే చర్మం చీలిపోయేంత ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యాయని, చిత్రబృందం అంతా ప్రాణాలను పణంగా పెట్టి ఈ చిత్రాన్ని పూర్తి చేశారని అన్నారు.
సెప్టెంబర్ 10న విడుదల కానున్న ఈ రూటెడ్ డ్రామాలో విజువల్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయని సుహాస్ అన్నారు.
[Mandaadi Movie, Actor Suhas, Interview, Actor Soori, Telugu Film News, Telugu News]




