
దేనోడు దానికే ఉంటాడనే సామెత పురాణాల నుంచే ప్రాచుర్యంలో ఉంది. ప్రాచుర్యంలో ఉండటమేంటి అది నిజం అనే సంఘటనలని మనం రోజు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసంఘటన జరిగింది. తమిళనాడులోని నాగర్‌కోయిల్ సమీపంలోని తమ్మట్టుకోణం వీఐపీ గార్డెన్‌లో నివసించే ప్రముఖ దంపతులు వినోద్ కుమార్, మధుమిత యూట్యూబర్స్ గా రాణిస్తున్నారు.
యూట్యూబ్ తో పాటు ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్ కోసం నిరంతరం వీడియోలు చేసే ఈ దంపతులు, ఇటీవల తమ ఇంట్లోని పూజా గదిలో ఉన్న అపారమైన సంపదని ప్రపంచానికి చూపిస్తూ ఒక షార్ట్ వీడియో చేశారు. ఆ వీడియోలో తులాల కొద్దీ బంగారు ఆభరణాలు, దొంతులుగా పేర్చిన నగదును స్పష్టంగా ప్రదర్శించారు. ఆ ఆర్భాటమే ఇప్పుడు వారిని రోడ్డున పడేలా చేసింది. ఆ వీడియో వైరల్ అయిన కొద్ది రోజులకే దొంగలు పక్కా ప్లాన్‌తో వారి ఇంటిపై విరుచుకుపడ్డారు.
దొంగలు ఆ ఇంట ఉన్న సెక్యూరిటీని అత్యంత చాకచక్యంగా ఛేదించారు. పటిష్టమైన గేటెడ్ కమ్యూనిటీ, సీసీటీవీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ దొంగలు రాత్రికి రాత్రే ఇంటి వెనుక తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. వారు ఏమీ వెతకాల్సిన అవసరం లేకుండానే, వీడియోలో చూసిన పూజ గదిలోని సేఫ్‌పై దాడి చేసి నిమిషాల్లో పని పూర్తి చేసుకున్నారు. ఈ దొంగతనంలో ఏకంగా 118 సవర్ల (సవర్ అంటే 8 గ్రాములు) బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, భారీగా ఉన్న నగదును దోచుకెళ్లారు. అంతర్జాతీయ, స్థానిక మార్కెట్ విలువల ప్రకారం చోరీకి గురైన మొత్తం సంపద విలువ 1 కోటి వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: డాన్సర్స్ అసోసియేషన్‌లో మంటలు: ఆ రోజునే ఎన్నికలు ఎందుకు!

బాధితులు వెంటనే రాజాక్కమంగళం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లతో నిందితుల కోసం గాలిస్తున్నారు. అందుకే అంటారు అవసరానికి మించి 'షో' చేస్తే 'అటెన్షన్' గురించి ఆలోచించకుండా 'సరెండర్' అవుతాం. ఇది చరిత్ర చెప్పిన 'సత్యం'.
[Youtuber Gold Stolen TamilNadu, Tamil Nadu YouTuber Burglary, Madhumitha, 118 Sovereigns Gold Stolen, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






