
'బలగం' సినిమాతో తెలంగాణ పల్లె సంస్కృతిని, కుటుంబ బంధాలను గుండెలకు హత్తుకునేలా చూపించిన దర్శకుడు వేణు ఎల్దండి.. ఇప్పుడు తన రెండో చిత్రం 'ఎల్లమ్మ'(Yellamma)తో మన మూలాల్లోకి, ఆచారాల్లోకి మనల్ని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాతో రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేయగా, నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
తాజాగా విడుదలైన వీడియోలో డీఎస్‌పీ మనల్ని నేరుగా తన సొంత ఊరు 'వెదురుపాక' జాతర వాతావరణంలోకి తీసుకెళ్లారు. పల్లెటూరి జాతరలోని ఆ ఊపు, ఆ ఎమోషన్స్, సాంప్రదాయాల స్పిరిట్‌ను ఆయన ఈ వీడియో ద్వారా కళ్లకు కట్టారు.
మన మూలాల్లోకి తిరిగి వెళ్లడం, ఆ పాత జ్ఞాపకాలను, పండుగ వాతావరణాన్ని మళ్లీ అనుభవించడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన ఊరి జాతర వేడుకల వెనుక ఉన్న ఆత్మను, ఆ వైబ్‌ను ఈ వీడియోలో అద్భుతంగా వివరించడం విశేషం.
దర్శకుడు వేణు ఎల్దండి రాసుకున్న ఈ సాలిడ్ స్క్రిప్ట్ వినగానే తనకు మైండ్ బ్లోయింగ్ అనిపించిందని డీఎస్‌పీ ఇదివరకే వెల్లడించారు. ఈ వీడియో చూస్తుంటే పక్కా లోకల్ నేటివిటీతో, హై వోల్టేజ్ మ్యూజిక్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పించేలా దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వబోతున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.





