తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకోబోతున్నారు. విభిన్నమైన కథలు, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుకలో అవార్డు ప్రజెంటర్‌గా వ్యవహరించే అవకాశం విజయ్ సేతుపతికి లభించింది. నవంబర్ 23న న్యూయార్క్‌లో జరగనున్న ఈ వేడుకలో ఆయన అవార్డును అందించనున్నారు. ఈ ఘనత సాధించనున్న తొలి భారతీయ నటుడిగా విజయ్ సేతుపతి చరిత్ర సృష్టించబోతున్నారు.
ఇప్పటివరకు భారతీయ నటీనటులు అంతర్జాతీయ అవార్డుల వేడుకల్లో పాల్గొన్నప్పటికీ, ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై ప్రజెంటర్‌గా అవార్డును అందించనున్న తొలి భారతీయ నటుడు మాత్రం విజయ్ సేతుపతే కావడం విశేషం. గతంలో 2016లో ప్రియాంక చోప్రా 68వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుల వేడుకలో ప్రజెంటర్‌గా వ్యవహరించారు. అలాగే 2024లో హాస్యనటుడు వీర్ దాస్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఇప్పుడు విజయ్ సేతుపతికి ఈ అవకాశం రావడంతో భారతీయ సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ ప్రతిభకు మరిన్ని అవకాశాలు కల్పించడంలో నిర్మాత, ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డు సభ్యురాలు కవితా గుప్తా కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. 2024లో వీర్ దాస్‌ను ఇంటర్నేషనల్ ఎమ్మీ వేదికపైకి తీసుకురావడంలోనూ ఆమె పాత్ర ఉంది. ఈ ఏడాది జరిగే 54వ ఎమ్మీ వేడుకల్లో భారతదేశానికి చెందిన రెండు ప్రాజెక్టులు కూడా నామినేషన్లు దక్కించుకున్నాయి. సోనీ లివ్ వెబ్‌సిరీస్ ‘రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్’ బెస్ట్ డ్రామా సిరీస్ విభాగంలో, వీర్ దాస్ నెట్‌ఫ్లిక్స్ కామెడీ స్పెషల్ ‘ఫూల్ వాల్యూమ్’ బెస్ట్ కామెడీ విభాగంలో పోటీ పడుతున్నాయి.
ఇక విజయ్ సేతుపతి సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘బత్తా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరోవైపు ఆయన నటించిన ‘మహారాజా’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. 2024లో విడుదలైన ఈ థ్రిల్లర్ చైనాలోనూ మంచి విజయాన్ని అందుకుంది. అక్కడ థియేటర్లలో దాదాపు రూ.91.65 కోట్ల వసూళ్లు సాధించినట్లు కథనాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: ‘సీన్’ మూవీ రివ్యూ
ఈ స్పందనతో హాలీవుడ్ ఏజెన్సీ ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌లో రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపించింది. రీమేక్ హక్కుల కోసం నిర్మాతలను సంప్రదించగా, ప్రస్తుతం ఓ ప్రముఖ హాలీవుడ్ నటుడితో ప్రాజెక్టును సెట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిర్మాత సుధన్ సుందరం వెల్లడించారు. ఇదిలా ఉంటే ‘మహారాజా’ హాలీవుడ్ రీమేక్‌లో మాథ్యూ మెక్కనాహే నటించనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై నిర్మాత నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
నటీనటుల వివరాలను సంబంధిత హాలీవుడ్ ఏజెన్సీనే వెల్లడిస్తుందని నిర్మాత స్పష్టం చేశారు. మరోవైపు విజయ్ సేతుపతి ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘ఇంజి వెల్లం’ సినిమాలో సాయి పల్లవితో కలిసి నటిస్తున్నారు. అలాగే ‘ట్రైన్’, ‘పాకెట్ నవల్’ వంటి చిత్రాలు కూడా ఆయన తదుపరి ప్రాజెక్టుల జాబితాలో ఉన్నాయి. మొత్తానికి ఒకవైపు అంతర్జాతీయ ఎమ్మీ వేదికపై అరుదైన గౌరవం, మరోవైపు హాలీవుడ్ రీమేక్ రూపంలో విజయ్ సేతుపతి పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది.
మీకు నచ్చవచ్చు: అయిగిరి నందిని: ‘మహాకాళి’ సాంగ్.. ఎనిమిది నిమిషాలు పూనకాలే
[Vijay Sethupathi, Vijay Sethupathi International Emmy Awards, 54th International Emmy Awards 2026, Vijay Sethupathi First Indian Actor, Vijay Sethupathi Emmy Presenter, Maharaja Hollywood Remake, Vijay Sethupathi Maharaja, Mani Ratnam Inji Vellam, Sai Pallavi Vijay Sethupathi]





