Home

»

Latest News

ఆదర్శ కుటుంబం.. చిట్టిబాబుగా వెంకటేష్ మ్యాజిక్.!

Jul 27, 2026 2:11PM

తెలుగు సినీ ప్రియులకు ఎప్పుడూ నవ్వులు పంచే విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మాణంలో, మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరకల్పనలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విక్టరీ వెంకటేష్ పాత్రను 'చిట్టిబాబు'గా పరిచయం చేస్తూ విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ గ్లింప్స్ వీడియోలో విక్టరీ వెంకటేష్‌ను 'చిట్టిబాబు'గా అత్యంత వినోదాత్మకంగా, విభిన్నమైన మ్యానరిజమ్స్‌తో డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. వీడియోలో కిచెన్‌లో ఏసీని సెట్ చేయడం, ఇంట్లో వాషింగ్ మెషీన్ ఉండటంతో హీరోయిన్ శ్రీనిధి శెట్టి "నువ్వు వంట చేసేటప్పుడు హ్యాపీగా ఏసీ వేసుకొని చేసుకోవచ్చు నాన్నా.. నీకు పని బాగా తగ్గిపోయినట్లే" అంటూ వెంకటేష్‌ను ఆటపట్టిస్తుంది. దానికి వెంకటేష్ తన ప్రత్యేకమైన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో స్పందిస్తూ పక్కనున్న రఘుబాబుతో "యస్, ఐ యామ్ ది మ్యాన్ ఆఫ్ ది హౌస్. అస్తమానం తల తిప్పకండి బుజ్జిగారు మెడ పట్టేస్తుంది. నాకు ఎవరేం పని చేసినా నచ్చదు, అన్నీ నేనే చూసుకుంటాను" అని చెప్పడం, దానికి పక్కనే ఉన్న రఘుబాబు "ఆవిడకి ఏమీ రాదు, అన్నీ మీరే చేసుకుంటారు" అంటూ ఇచ్చే కౌంటర్ కామిక్ టైమింగ్స్ ప్రేక్షకులకు వినోదాల విందు పంచుతున్నాయి. నారా రోహిత్ "ఆదర్శ కుటుంబం" అనే డైలాగ్ తో టీజర్ ను ముగించిన తీరు బాగుంది.

త్రివిక్రమ్ మార్క్ మాటల విన్యాసం, తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ ఈ వీడియో హైలైట్ గా నిలిచాయి. కుటుంబ వ్యవస్థలోని ఆప్యాయతలు, ఇంటి పనుల్లో మగవారి పాత్రను హాస్యభరితంగా చూపిస్తూనే, లోతైన కుటుంబ అనుబంధాలను స్పృశించే సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని రూపుదిద్దుతున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఇక టీజర్ చివరలో రైలు ప్రయాణంలో వెంకటేష్ తన కుటుంబంతో కలిసి డోర్ నుంచి బయటకు చూసే విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను అక్టోబర్ 2, 2026న థియేటర్లలో అడుగు పెట్టనుంది.

 

 

Venkatesh, Chittibabu, Aadarsha Kutumbam, Trivikram

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com