
ముకుంద, కంచె... ఇలా వైవిధ్య భరితమైన కథలతో ప్రయాణం సాగిస్తున్నాడు వరుణ్‌తేజ్. తాను శ్రీనువైట్లతో కలసి ఓ సినిమా చేస్తున్నాడు అనగానే... మనోడు కూడా కమర్షియల్ దారిలోనే వెళ్లిపోతున్నాడేమో అన్న అనుమానం వేసింది. ఎందుకంటే శ్రీనువైట్ల ఇప్పటి వరకూ తీసిన సినిమాల్నీ కమర్షియల్ పంథాలోనే సాగాయి. దాంతో... ఈ మెగా హీరో మాస్ బాట పట్టే ప్రయత్నాలు మొదలెట్టాడనిపించింది. అయితే ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేసింది మిస్టర్ టీజర్. శ్రీనువైట్ల - వరుణ్‌తేజ్ కాంబో లో తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్. నూతన సంవత్సర శుభాకాంక్షలతో.. ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. టీజర్ చూస్తే ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనిపిస్తోంది. శ్రీనువైట్ల మార్కు ఎక్కడా కనిపించలేదు. అరుపులూ గోలలూ లేవు. ఓ ప్లజెంట్ సినిమా చూడబోతున్నామన్న భరోసా కలిగింది. వరుణ్ తేజ్ మార్క్‌తోనే ఈ సినిమా ఉండబోతోందన్నది అర్థమైంది. పంచ్ డైలాగుల జోలికి వెళ్లకుండా నీట్‌గా టీజర్‌ని కట్ చేసిన విధానం ఆకట్టుకొంది. మొత్తానికి టీజర్ తో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెంచేశాడు శ్రీనువైట్ల. దాన్ని నిలుపుకొంటే... ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న హిట్ శ్రీనువైట్లకు దొరికేసినట్టే.






