
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు కోదండరామిరెడ్డి. ముఖ్యంగా చిరంజీవితో అయితే వరుస బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందించాడు నాగేశ్వరరావు, కృష్ణతో కూడా అదిరిపోయే హిట్ సినిమాలు ఇచ్చి కమర్షియల్ గా తెలుగు సినిమా ఎదుగుదలలో కీలక భూమిక పోషించాడని చెప్పవచ్చు. కోదండరామి రెడ్డి కొడుకు పేరు వైభవ్ రెడ్డి. ప్రస్తుతం తమిళ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న వైభవ్ టాలీవుడ్‌లో సోలో హీరోగా స్థిరపడలేకపోవడం వెనుక ఉన్న కారణాలు, ప్రస్తుత సినిమా పరిణామాలు, భవిష్యత్తు అవకాశాలపై ఒక లుక్ వేద్దాం.
వైభవ్ రెడ్డి 2007లో వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన 'గొడవ' చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టాడు. కోదండరామి రెడ్డి వంటి దిగ్గజ దర్శకుడి వారసుడిగా రావడంతో ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత 'గోలమారి' వంటి కొన్ని తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా విజయం సాధించలేకపోయాయి. దీంతో వైభవ్ తన దృష్టిని తమిళ చిత్రసీమ వైపు మళ్లించారు. కోలీవుడ్‌లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన 'సరోజా' చిత్రం వైభవ్ కెరీర్‌ని మలుపు తిప్పింది. ఆ తర్వాత 'గోవా', 'మంగత్తా' (తెలుగులో గ్యాంబ్లర్) వంటి మల్టీస్టారర్ చిత్రాలలో నటించి కోలీవుడ్‌లో ఒక ప్రామిసింగ్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. తమిళంలో 'మేయాద మాన్' వంటి చిత్రాలతో సోలో హీరోగా 10 కోట్లకు పైగా వసూళ్లని సాధించి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. కెరీర్‌లో ఇప్పటివరకు 25కి పైగా సినిమాల్లో నటించిన వైభవ్, కామెడి, థ్రిల్లర్, డ్రామా విభాగాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే తమిళంలో సాధించిన ఈ విజయాన్ని తెలుగులో సోలో హీరోగా పునరావృతం చేయడంలో ఆయన తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తెలుగులో వైభవ్ నటించిన 'అనామిక' లేదా ఇతర ప్రాజెక్టులు మల్టీస్టారర్ లేదా ముఖ్య పాత్రలకే పరిమితమయ్యాయి.
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. టాలీవుడ్‌లో సోలో హీరోగా మార్కెట్ ఏర్పడాలంటే కేవలం వారసత్వం లేదా నటనా నైపుణ్యం మాత్రమే సరిపోవు. సరైన కథల ఎంపిక, బలమైన నిర్మాణ సంస్థల మద్దతు, ప్రమోషన్లు,బాక్సాఫీస్ వద్ద కనీసం15 నుండి 20 కోట్ల వసూళ్లని రాబట్టగల స్టామినా అవసరం. నేటి రోజుల్లో చిన్న, మధ్య తరహా సినిమాలకు థియేటర్లలో ప్రేక్షకులు రావడం పెద్ద సవాలుగా మారింది. అలాగే OTT ప్లాట్‌ఫారమ్‌ల రాకతో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. కొత్తగా వచ్చే సోలో హీరోలు యూనిక్ కాన్సెప్ట్‌లతో వస్తేనే థియేటర్లకు జనాలు వస్తున్నారు.
Also read: అగస్ట్ 1 న థియేటర్స్ లోకి వచ్చేస్తున్నా..మీరు రెడీనా!
ఈ పరిస్థితుల్లో వైభవ్ రెడ్డి తెలుగులో నేరుగా సోలో హీరోగా నిలదొక్కుకోవడం కష్టమేనా అంటే, పూర్తిగా కాదని చెప్పలేం కానీ అత్యంత సవాలుతో కూడుకున్న విషయమనే చెప్పాలి. కోలీవుడ్‌లో ఆయనకున్న మార్కెట్ మరియు క్రేజ్ తెలుగులో లేదు. అక్కడ వరుస ఆఫర్లు వస్తుండటంతో, తమిళ సినిమాల పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయితే ప్రస్తుతం పాన్-ఇండియా సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో, వైభవ్ తమిళంలో చేసే విభిన్నమైన కాన్సెప్ట్ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయి మంచి విజయం సాధించే అవకాశం ఉంది. అంతేకాకుండా, OTT సిరీస్‌లు మరియు నెట్‌ఫ్లిక్స్, ఆహా వంటి ప్లాట్‌ఫారమ్‌లలో వస్తున్న వెబ్ ప్రాజెక్టులు వైభవ్‌కి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. సోలో హీరోగా కాకుండా శక్తివంతమైన పాత్రలు లేదా మల్టీస్టారర్ సినిమాల ద్వారా తెలుగులో రీ ఎంట్రీ ఇస్తే తిరుగులేని ఆదరణ లభించే అవకాశం ఉంది.
chiranjeevi, balakrishna, vaibhav reddy, kondanda ramireddy





