
కన్నడ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న రియల్ స్టార్ ఉపేంద్ర గురించి టాలీవుడ్ ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలక్షణ నటన, విభిన్నమైన సబ్జక్ట్స్ తో భారీ సంఖ్యలో కల్ట్ ఫ్యాన్స్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ విలక్షణ నటుడి ఇంట్లో ఘనంగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఉపేంద్ర అన్న సుధీంద్ర కుమార్, వీణ దంపతుల కుమారుడు, యువ హీరో నిరంజన్ సుధీంద్ర త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.
ఈ మేరకు మే 25వ తేదీన సోమవారం నాడు బెంగళూరులోని ఒక ప్రముఖ ప్రైవేట్ రిసార్ట్‌లో నిరంజన్ సుధీంద్ర నిశ్చితార్థ వేడుక సంజనా బి రాజ్ తో ఘనంగా జరిగింది. వృత్తిరీత్యా గాైనకాలజిస్ట్ వైద్యురాలైన సంజనాతో సుధీంద్రకి గత కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ వేడుకకి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఒకవైపు క్లాసిక్ సాంప్రదాయ లుక్‌లో నిరంజన్ కనిపించగా, మరోవైపు ఎంతో అందమైన లెహంగాలో సంజన మెరిసిపోయింది. ఈ వేడుకకి సంబంధించిన అందమైన ఫోటోలని ఉపేంద్ర సతీమణి ప్రియాంక ఉపేంద్ర తన అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా అభిమానులతో పంచుకోవడంతో నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
నిరంజన్ సుధీంద్ర సినీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే, ఆయన తన బాబాయ్ ఉపేంద్ర మార్గదర్శకత్వంలోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. మొదట 'బళ్లారి నాగ' అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత 2018 లో వచ్చిన 'సెకండాఫ్' అనే కన్నడ సినిమా ద్వారా హీరోగా మారాడు. ఈ సినిమాలో ప్రియాంక ఉపేంద్ర ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఆపై 2022 లో విడుదలైన 'నమ్మ హుడుగురు' చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం కన్నడలోనే కాకుండా ఈ ఏడాది ఫిబ్రవరి 2026 లో విడుదలైన 'సీతా పయనం' (Seetha Payana) అనే ద్విభాషా చిత్రం ద్వారా నిరంజన్ తెలుగు ప్రేక్షకులని పలకరించాడు. ప్రముఖ సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన సీతాపయణంలో లో అర్జున్ కుమార్తె ఐశ్వర్య సర్జా టైటిల్ రోల్ పోషించింది.






