మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఆధ్యాత్మికతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా శ్రీరాముడు, హనుమంతుడిపై తనకున్న భక్తిని తరచూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె చేసిన ఓ ప్రత్యేకమైన పని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన తాతయ్య, అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికి ఉపాసన అరుదైన శ్రీరాముడి విగ్రహాన్ని కానుకగా అందించారు.
ఉపాసన ఇటీవల 21 రోజుల పాటు సుందరకాండ పారాయణం చేయాలని సంకల్పించారు. ఆ పారాయణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా తాతయ్యకు ఈ ప్రత్యేకమైన బహుమతిని అందించారు. ఈ కానుక వెనుక ఉన్న మరో విశేషం ఏంటంటే.. ఈ శ్రీరాముడి విగ్రహాన్ని సాధారణ శిల్పి తయారు చేయలేదు. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించిన రామలల్లా విగ్రహాన్ని మలిచిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతుల మీదుగా దీనిని ప్రత్యేకంగా తయారు చేయించారు.
నిజానికి ఈ విగ్రహాన్ని ఉపాసన ఏడాది క్రితమే తన తాతయ్య కోసం ప్రత్యేకంగా తయారు చేయించేందుకు ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. సుందరకాండ పారాయణం పూర్తయిన 21వ రోజునే ఈ విగ్రహం కూడా సిద్ధం కావడం విశేషంగా మారింది. ఈ విషయం తనకు కేవలం యాదృచ్ఛికంగా అనిపించడం లేదని, దైవ నిర్ణయంగా భావిస్తున్నానని ఉపాసన పేర్కొన్నారు. తన తాతయ్యకు శ్రీరాముడిపై ఉన్న భక్తి, సుందరకాండ పారాయణంపై ఆయనకున్న ఆసక్తి తనను ఎంతగానో ప్రభావితం చేశాయని ఆమె తెలిపారు.
అయోధ్యలోని రామ మందిరం కోసం అరుణ్ యోగిరాజ్ రూపొందించిన రామలల్లా విగ్రహం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన అరుణ్ యోగిరాజ్ కుటుంబం ఐదు తరాలుగా శిల్పకళను కొనసాగిస్తోంది. రామలల్లా విగ్రహంతో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆదిశంకరాచార్య విగ్రహాలను కూడా ఆయన రూపొందించారు.
ఇలాంటి ప్రముఖ శిల్పి చేతుల మీదుగా తన తాతయ్య కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన శ్రీరాముడి విగ్రహాన్ని అందించడం ద్వారా ఉపాసన ఈ కానుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. కుటుంబ బంధం, ఆధ్యాత్మిక విశ్వాసం కలిసిన ఈ సందర్భాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు, నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు.
[Upasana Konidela, Ram Charan Wife Upasana, Upasana Sri Rama Idol, Prathap C Reddy, Arun Yogiraj, Ram Lalla Sculptor, Ayodhya Ram Idol, Sundarakandam Parayana, Upasana Spiritual Journey, Mega Family, Ram Charan, Lord Rama Idol, Tollywood News]




