టిక్ టాక్‌లో ఎంట్రీ ఇచ్చి రచ్చ చేసేసింది!
on Apr 3, 2020
లాక్డౌన్ కాలంలో విసుగును జయించడానికి జనం రకరకాల పనులు చేస్తున్నారు. సెలబ్రిటీలు సహా చాలామంది ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు అతుక్కుపోతూ, ఆటలు ఆడుతూ, సోషల్ మీడియా యాప్స్‌లో న్యూస్ చదువుతూ, ప్రజలను చైతన్యపరిచే వీడియోలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని అన్ని రకాల ప్రజలకు కాలక్షేపంగా మారిన టిక్ టాక్, కరోనా కాలంలో మరింతగా పాపులారిటీ సంపాదించుకుంది. సామాజిక దూరం పుణ్యమా అంటూ తీరిక సమయం దొరకడంతో చాలామంది టిక్ టాక్‌లోని వీడియోలను ఎంజాయ్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఒక సౌతిండియన్ స్టార్ హీరోయిన్ టిక్ టాక్ యాప్‌లో తన డాన్స్ మూవ్‌మెంట్స్‌తో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆమె మరోవరో కాదు.. త్రిష!
స్టైలిష్ గాగుల్స్, పర్పుల్ టాప్, బ్లాక్ షార్ట్స్ ధరించిన త్రిష.. అమెరికన్ ర్యాప్ సింగర్ మేగన్ థీ స్టాలియన్ పాపులర్ ట్రాక్ అయిన 'సేవేజ్'కు డాన్స్ చేస్తూ కనిపించింది.' ఐ బిట్ ద బెయిట్, సేవేజ్ ఛాలెంజ్' అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ జోడించింది త్రిష. ఇప్పటిదాకా దానికి 31 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. తమ ఆరాధ్య తార డాన్స్ చూసిన అభిమానులు తెగ సంతోషపడిపోతూ స్పందిస్తున్నారు. కొంతమందైతే ఆమె డాన్స్‌ను పొగుడుతూనే టిక్ టాక్ అనేది చైనీయుల యాప్ అనీ, ఆ యాప్‌ను వాడొద్దని కూడా సలహా ఇవ్వడం గమనార్హం. ఎక్కువ మంది మాత్రం ఈ తరహాలోనే మరిన్ని వీడియోలను పోస్ట్ చెయ్యమని త్రిషను కోరారు. వారం క్రితం సోషల్ మీడియాలో పెట్ డాగ్స్‌తో గడుపుతున్న వీడియో త్రిష షేర్ చేయగా, అది వైరల్ అయ్యింది.