
రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్' నుంచి విడుదలైన తొలి పాట 'తబాహీ' రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ తో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే జోష్‌ను కొనసాగిస్తూ మేకర్స్ రెండో పాట 'మనసాగదే' (తెలుగు వెర్షన్)ను విడుదల చేశారు.
'తబాహీ' ప్రేమలోని ఉప్పొంగే ఉద్వేగాలను చూపిస్తే, 'మనసాగదే' మాత్రం ప్రేమలోని మరో కొత్త కోణాన్ని ప్రజెంట్ చేసింది. మనసులో దాచుకున్న భావాలు, తీరని తపన, మౌనంగా మిగిలిపోయిన ప్రేమను ఈ పాట ఎంతో అందంగా పలికిస్తుంది. ప్రతి ప్రేమకథలో ఎన్నో భావోద్వేగాల పొరలు ఉంటాయని, ప్రతి దశ ప్రేమకు కొత్త అర్థాన్ని ఇస్తుందని ఈ పాట చెబుతోంది.
ఈ పాటలో రాయా(యష్), రెబెకా (తారా సుతారియా) పాత్రల మధ్య బంధాన్ని పూర్తిగా కొత్త కోణంలో చూపించారు. వీరిద్దరి మధ్య కనిపించే కెమిస్ట్రీ, ఎమోషన్స్ కట్టిపడేసింది. 'తబాహీ' లో కనిపించిన రాయా పాత్ర ఈసారి మనసులో నడుస్తున్న సంఘర్షణను కూడా సూచిస్తుంది. నయనతార కూడా యష్ తో కలిసి సిగరెట్ కాలుస్తూ ఈ సాంగ్ లో కనిపించడం విశేషం. ఇప్పటిదాకా విడుదలైన కంటెంట్, ఫస్ట్ సింగిల్ తరహాలోనే ఈ సాంగ్ విజువల్స్ కూడా బోల్డ్ గానే ఉన్నాయి.
తనిష్క్ బాగ్చి, అర్స్లాన్ నిజామీ, ఫహీమ్ అబ్దుల్లా స్వరపరిచిన ఈ రొమాంటిక్ మెలోడీకి సిద్ధార్థ్ బస్రూర్ తన వోకల్స్ తో ప్రాణం పోశారు. ఐదు భాషల్లో విడుదలైన ఈ పాట తెలుగు వెర్షన్‌కు 'మనసాగదే' టైటిల్ తో రిలీజ్ చేశారు.
తెలుగు సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి అందించారు. హిందీలో 'మధోష్', కన్నడలో 'మనమోహక', తమిళంలో 'తడుమారుధేయ్', మలయాళంలో 'మధుమోహిని' పేర్లతో ఈ పాట విడుదలైంది.
ఈ చిత్రంలో యష్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
యష్, గీతు మోహన్‌దాస్ కలిసి కథను అందించగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న 'టాక్సిక్' కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు పలు భాషల్లో డబ్ వెర్షన్లు విడుదల కానున్నాయి. ఈ చిత్రం 2026 ఆగస్టు 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Yash, Toxic Movie, Second Single, Manasaagadhe Song, Tara Sutaria




