సినిమా నిర్మాణం అంటే నిర్మాతలకు ఎన్నో కష్టాలు ఉంటాయి. కథను సిద్ధం చేసుకోవడం దగ్గరి నుంచి నటీనటులను ఎంపిక చేయడం, షూటింగ్ పూర్తి చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించడం వరకు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సినిమా పూర్తయిన తర్వాత విడుదల తేదీని ప్రకటించి ప్రమోషన్స్ మొదలుపెడతారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలకు సినిమా పూర్తయినా మరో సమస్య ఎదురవుతోందట. అదే హైదరాబాద్ సెన్సార్ కార్యాలయంలో బ్యానర్ ఐడీల జారీకి జరుగుతున్న ఆలస్యం. ఈ వ్యవహారంపై పలువురు నిర్మాతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఈ బ్యానర్ ఐడీ అంటే ఏమిటంటే.. సినిమా నిర్మించే ప్రతి సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వద్ద నమోదు చేసుకొని ప్రత్యేక గుర్తింపు కార్డు పొందాలి. 2017లో కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. నకిలీ నిర్మాణ సంస్థలను అడ్డుకోవడంతోపాటు సినిమా నిర్మాణంలో పారదర్శకత తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఐడీ నంబర్ ఉంటేనే సంబంధిత సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియకు ముందుకు వెళ్తుంది. అంటే బ్యానర్ ఐడీ రాకపోతే సినిమా సెన్సార్‌కు వెళ్లే విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి.
అయితే దేశంలోని ఇతర ప్రాంతీయ సెన్సార్ కార్యాలయాల్లో ఈ ఐడీ జారీ ప్రక్రియ ఒక రోజులోనే పూర్తవుతోందని నిర్మాతలు చెబుతున్నారు. ఆధార్, పాన్ కార్డు వంటి వివరాలు సమర్పిస్తే 24 గంటల్లోనే ఐడీ వస్తోందని అంటున్నారు. కానీ హైదరాబాద్‌లో మాత్రం వారాలు, నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా అఫిడవిట్లు అడగడం, ఆధార్ కార్డులో ఫొటో సరిగ్గా లేదని అభ్యంతరాలు చెప్పడం, పాత ఫొటోలు కాకుండా కొత్త పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకురావాలని కోరడం వంటి కారణాలతో దరఖాస్తులు తిరస్కరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: పెళ్లయ్యాక అలాంటి పాత్రలు చేయకూడదా? కియారా విషయంలో సిద్ధార్థ్ ఏమన్నారంటే.!
ఈ సమస్యకు ప్రధాన కారణం హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ కార్యాలయానికి పూర్తిస్థాయి రీజినల్ ఆఫీసర్ లేకపోవడమేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరి నుంచి ఇక్కడ రెగ్యులర్ అధికారి లేకపోవడంతో అదనపు బాధ్యతలు అప్పగించి కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. దూరదర్శన్ విభాగంలో డైరెక్టర్ స్థాయి అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ రాహుల్ గౌలికర్కు ఈ బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఫైళ్ల పరిశీలన, అనుమతుల జారీ నెమ్మదిగా సాగుతోందని నిర్మాతలు చెబుతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నా అపాయింట్మెంట్లు దొరకడం లేదని, ఫోన్లు కూడా స్పందించడం లేదని కొందరు వాపోతున్నారు.
ఇక ఈ వ్యవహారంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా దృష్టి పెట్టింది. హైదరాబాద్ సెన్సార్ కార్యాలయానికి వెంటనే పూర్తిస్థాయి రీజినల్ ఆఫీసర్‌ను నియమించాలని ఛాంబర్ భావిస్తోంది. ప్రస్తుతం సెంట్రల్ సెన్సార్ బోర్డు చైర్మన్‌గా ఉన్న వెంపటి శశికుమార్ తెలుగు ప్రాంతానికి చెందినవారు కావడంతో, ఆయన దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆయన నుంచి సానుకూల స్పందన వస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.
సినిమా నిర్మాణం కోసం నిర్మాతలు అప్పులు చేసి మరీ డబ్బులు ఖర్చు పెడుతుంటారు. షూటింగ్ పూర్తయిన తర్వాత విడుదల ఆలస్యమైతే అప్పులపై వడ్డీలు పెరుగుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్యానర్ ఐడీ కోసం కూడా నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తే చిన్న నిర్మాతలపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే హైదరాబాద్ సెన్సార్ కార్యాలయంలో ఈ సమస్యకు త్వరగా పరిష్కారం చూపించాలని టాలీవుడ్ నిర్మాతలు కోరుతున్నారు. మరి ఈ వ్యవహారంపై సెన్సార్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
ఇటలీ నుంచి నేరుగా పెళ్లి మండపంలోకి.. ప్రభాస్ ఏం చేయబోతున్నారు.?
ఓటీటీలో ‘జైలర్2’: సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్!
[Tollywood Producers, Hyderabad Censor Board, CBFC Banner ID, Banner ID Registration, Telugu Film Producers Problems, Hyderabad Censor Office, Tollywood Latest News, Film Certification Process, CBFC Regional Office, Vempati Sasikumar, Dr Rahul Gaulikar, Telugu Film Industry News]






