తెలుగు సినిమాల్లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ఒకప్పుడు ప్రేమకథలు, ఆ తర్వాత మాఫియా, హారర్, పోలీస్, థ్రిల్లర్, పల్లెటూరి నేపథ్యం, యాక్షన్ సినిమాలు వరుసగా వచ్చాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో గ్యాంగ్‌స్టర్ కథల హవా కనిపిస్తోంది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు తమ సినిమాల్లో పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రల్లో కనిపించబోతున్నారు. వీరితో పాటు నాని కూడా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్లడీ రోమియో’లో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. దీంతో రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో డాన్‌ల హవా మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘కాకా’లో చిరంజీవి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని టాక్. ఇందులో ఒక పాత్ర తండ్రి కాగా, మరో పాత్రలో పవర్‌ఫుల్ మాఫియా డాన్‌గా కనిపిస్తారట. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్ కథతో పాటు తండ్రీకూతుళ్ల ఎమోషన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు నాగార్జున తన వందో సినిమా ‘కింగ్ 100’లో గ్యాంగ్‌స్టర్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. తండ్రి పాత్రతో పాటు ఫ్లాష్‌బ్యాక్‌లో మాఫియా లీడర్‌గా కనిపిస్తారని సమాచారం. డబ్బు, గుర్తింపు కోసం ఆయన చేసే పోరాటం చుట్టూ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. పైగా చాలా ఏళ్ల తర్వాత నాగార్జున–టబు కలిసి నటిస్తుండటం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఇక బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దాదా’ కూడా గ్యాంగ్‌స్టర్ కథతోనే వస్తోంది. ఇందులో బాలయ్య ముంబై బేస్డ్ డాన్‌గా కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఆయన మాస్ అవతార్, పవర్‌ఫుల్ డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. గతంలోనూ మాఫియా డాన్ పాత్రల్లో కనిపించిన బాలకృష్ణ ఈసారి ఎలాంటి కొత్త షేడ్స్‌తో కనిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’లో మాత్రం గ్యాంగ్‌స్టర్ కథకు కాస్త భిన్నమైన టచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో తొలిసారి ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. ఓ క్రమశిక్షణ గల పోలీస్ అధికారి పరిస్థితుల కారణంగా గ్యాంగ్‌స్టర్‌గా మారితే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’లో గ్యాంగ్‌స్టర్ కథ మరింత భారీ స్థాయిలో ఉండనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఒప్పియమ్ ట్రేడ్, గోల్డెన్ ట్రయాంగిల్, మాఫియా వార్స్ నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు గ్లింప్స్ ద్వారా ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఎన్టీఆర్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్, ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. దీంతో ‘డ్రాగన్’ సాధారణ గ్యాంగ్‌స్టర్ సినిమా కాకుండా భారీ వరల్డ్‌తో తెరకెక్కుతున్న చిత్రంగా కనిపిస్తోంది.
మరోవైపు నాని కూడా వరుస మాస్ సినిమాల తర్వాత ‘బ్లడీ రోమియో’తో గ్యాంగ్‌స్టర్ అవతార్‌లోకి మారుతున్నారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్, డార్క్ హ్యూమర్ మేళవించిన స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. నాని బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌లోనే ‘హి ఈజ్ ఏ నంబర్‌వన్ గ్యాంగ్‌స్టర్’ అంటూ ఆయన పాత్రను పరిచయం చేశారు. ఈ సినిమాతో నానిని ఇంతకుముందెన్నడూ చూడని కొత్త అవతార్‌లో చూపించేందుకు సుజీత్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. మొత్తంగా చూస్తే.. ఒకే సమయంలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్, నాని వంటి స్టార్ హీరోలు గ్యాంగ్‌స్టర్ కథలతో రావడం టాలీవుడ్‌లో ఈ జానర్‌కు ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది. మరి వీరిలో ఎవరి డాన్ అవతార్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందో చూడాలి.
[Tollywood Gangster Movies, Telugu Gangster Movies, Chiranjeevi Kaka, Nagarjuna King 100, Balakrishna Dada, Prabhas Spirit, NTR Dragon, Nani Bloody Romeo, Upcoming Telugu Movies, Tollywood Movies]






