
దీపావళి తర్వాత కూడా తెలుగు ప్రేక్షకులకు థియేటర్లలో వినోదం తగ్గడం లేదు. నవంబర్ రెండో వారంలో ఏకంగా పది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవంబర్ 12, 13 తేదీల్లో విడుదల కానున్న ఈ చిత్రాల్లో శర్వానంద్ ‘భోగి’, మౌళి ‘DNK’, అనీష్ ‘ఇట్లు అర్జున’ వంటి సినిమాలపై ఆసక్తి నెలకొంది. వీటితో పాటు ‘GOAT’, ‘మాయా లేడీ’, ‘రోమియో జూలియట్’, ‘డార్క్ చాక్లెట్’ వంటి చిత్రాలు కూడా బరిలోకి దిగుతున్నాయి. మరి ఈ వారం విడుదలయ్యే పది సినిమాలేంటో ఓసారి చూద్దాం.
భోగి:
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మించారు. డింపుల్ హయాతి కీలక పాత్రలో కనిపించనున్నారు. 1960ల నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 12న థియేటర్లలోకి రానుంది.
GOAT:
సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘GOAT’. దివ్యభారతి హీరోయిన్ గా నటించారు. యాక్షన్, కామెడీ, రొమాన్స్ అంశాలతో రూపొందిన ఈ సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అ (AH):
రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘అ’. సాయి బాలీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. నవంబర్ 12న ఈ చిత్రం విడుదల కానుంది.

ఇట్లు అర్జున:
అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేశ్ ఉప్పాల దర్శకత్వం వహించారు. నాగార్జున సమర్పణలో వస్తున్న ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయమవుతున్నారు. వెంకీ కుడుముల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేసిన ట్రైలర్ సినిమాకు మంచి ప్రచారం తీసుకొచ్చింది. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం నవంబర్ 13న విడుదల కానుంది.
ఇది కూడా చదవండి: సోషల్ మీడియా క్రూరమైనది.. నాగార్జున షాకింగ్ కామెంట్స్.!
DNK:
లిటిల్ హార్ట్స్ తర్వాత మౌళి హీరోగా నటించిన మూవీ 'DNK'. మొదట ఈ సినిమాకు ‘దొంగ నా కొడుకు’ అనే టైటిల్ పెట్టగా, సెన్సార్ అభ్యంతరంతో 'DNK'గా మార్చారు. శ్రీను కంబాల దర్శకత్వం వహించారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాపై యువ ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తోంది. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
మాయ లేడి:
రాకేశ్ వర్రే, మధుమిత సర్కార్ జంటగా నటించిన మూవీ ‘మాయ లేడి’. ప్రసాంకర్ దర్శకత్వం వహించారు. కృష్ణ అనే కరాటే కోచ్ పాత్రలో రాకేశ్ వర్రే కనిపించనున్నారు. ట్విన్ సిస్టర్స్ మధ్యలో నలిగిపోయే యువకుడి కథగా ట్రైలర్ తోనే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. నవంబర్ 13న విడుదల కానుంది.
రోమియో జూలియట్:
హర్షిత్ రెడ్డి, విశాఖ ధిమన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రోమియో జూలియట్’. భర్గవ్ మాచర్ల దర్శకత్వం వహించారు. రొమాన్స్, మ్యూజికల్ అంశాలతో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉండనున్నాయి. నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

డార్క్ చాక్లెట్:
విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డార్క్ చాక్లెట్’. శశాంక్ శ్రీవత్సవాయ దర్శకుడు. విభిన్నమైన కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా నవంబర్ 13న విడుదల కానుంది.
టాల్కమ్ పౌడర్:
‘టాల్కమ్ పౌడర్’ కూడా ఈ వారమే థియేటర్లలోకి రానుంది. సైనాథ్ పొన్నా డైరెక్ట్ చేసిన ఈ క్రైమ్ కామెడీ ఫిల్మ్ లో సినిమాలో శివ కందుకూరి, ద్రిషికా చందర్ తదితరులు నటించారు. నవంబర్ 13న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
చంద్రయాన్:
శివకుమార్ ఢీకొండ, స్వప్న ప్రియదర్శిని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చంద్రయాన్’. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకుడు. అడ్వెంచర్, కామెడీ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా కూడా నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇలా నవంబర్ 12, 13 తేదీల్లో పది సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరి ఈ పది సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
బాలయ్యతో భీష్మ.. 17 ఏళ్ళ క్రితం ప్లాన్ చేసిన క్రేజీ మూవీ.. ఎందుకు ఆగిపోయింది.?
ఒకే ఏడాది మూడు సినిమాలు.. సూర్యను చూసి మన స్టార్స్ మారతారా.?
[Bhogi Movie, DNK Movie, Itllu Arjuna Movie, GOAT Telugu Movie, AH Movie, Maya Lady, Romeo Juliet, Dark Chocolate, Talcum Powder, Chandrayaan]






