Home

»

Latest News

Thiruveer: నన్ను డ్రైవర్ అనుకున్నాడు.. ఓజీ అసిస్టెంట్ డైరెక్టర్‌ అని అబద్ధం చెప్పా..!

Mar 26, 2026

వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ యంగ్ హీరో తిరువీర్(Thiruveer). 'మసూద', 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' వంటి చిత్రాలతో మెప్పించిన ఆయన, ఇప్పుడు 'పాపం ప్రతాప్'(Papam Prathap) అంటూ ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎస్‌.పి.దుర్గా నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ డ్రామా టీజర్ లాంచ్ కార్యక్రమం తాజాగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తిరువీర్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డ్రైవర్ అనుకున్నాడు
తాను ఎక్కువగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయడంపై తిరువీర్ తనదైన శైలిలో స్పందించాడు. తన దగ్గరకు వచ్చిన బెస్ట్ కథలు ఎంచుకొని చేస్తున్నానని, ప్లాన్ చేసి చేయట్లేదని తెలిపాడు. అలాగే తనని రియల్ గా హీరోలా చూడరు అంటూ తనకు ఎదురైన కొన్ని సంఘటనలను షేర్ చేసుకున్నాడు. 

"మసూద సినిమా షూటింగ్ సమయంలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నన్ను చూసి కారు డ్రైవర్ అనుకున్నాడు. నేను హీరోని అని చెబితే.. హీరో అయితే పక్కన మనుషులు ఉండాలి, గొడుగు ఉండాలి కదా అని అమాయకంగా అడిగాడు" అంటూ నవ్వుతూనే ఆ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నాడు. ఇలా ఒక్కసారి కాదు.. ఈ సినిమాలో హీరో ఎవరని నన్నే అడిగిన సందర్భాలు పలు ఉన్నాయని తిరువీర్ తెలిపాడు.

అసిస్టెంట్ డైరెక్టర్‌ అని చెప్పా
"అలాగే ఇటీవల ఫ్లయిట్ లో విజయవాడ వెళ్తూ.. ఫోన్ లో నేను మూవీ డేట్స్ గురించి మాట్లాడటంతో.. పక్కన కూర్చున్న వ్యక్తి సినిమా ఇండస్ట్రీయా అని అడిగాడు. నన్ను గుర్తుపట్టలేదని అర్థమై.. యాక్టర్ అని చెప్పకుండా.. ఓజీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌ని అని అబద్ధం చెప్పాను" అంటూ మరో ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నాడు తిరువీర్. 

టీజర్ అదిరింది.. కథేంటంటే?
తాజాగా విడుదలైన ‘పాపం ప్రతాప్’ టీజర్ చూస్తుంటే ఇది ఒక పక్కా విలేజ్ రొమాంటిక్ కామెడీ అని అర్థమవుతోంది. చిన్ననాటి నుంచి ప్రేమించిన అమ్మాయి బుజ్జమ్మను పెళ్లి చేసుకున్న ప్రతాప్ అనే అమాయకపు యువకుడి కథ ఇది. పెళ్లైన మూడు రోజులకే బుజ్జమ్మ పంచాయతీ పెట్టడం, ఊరంతా ప్రతాప్‌ను ఒక వింత చూపుతో చూడటం టీజర్‌లో భలే సరదాగా చూపించారు. అసలు ప్రతాప్ చేసిన తప్పేంటి? ఆ ఊరి జనం అతడిని ఎందుకు 'పాపం ప్రతాప్' అంటున్నారు? అన్నది తెలియాలంటే ఏప్రిల్ 17 వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com