మొన్న 'రాంగ్ స్వైప్'.. ఇప్పుడు '6 ఎమ్.పి'!
on Dec 6, 2021
డాక్టర్ యాక్టర్ అవ్వడం చూస్తుంటాం. అయితే ఈ డాక్టర్ డైరెక్టర్ అయ్యాడు. తాను డైరెక్టర్ అవ్వడమే కాకుండా మొదటి సినిమాతోనే మరో ఇద్దరు డాక్టర్స్ ని సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. ఆ డాక్టర్ టర్నడ్ డైరెక్టర్ పేరు రవికిరణ్ గాడాల. డైరెక్టర్ గా మొదటి సినిమాతోనే సినీ పెద్దల ప్రశంసలు అందుకున్న రవికిరణ్.. ఇప్పుడు రెండో సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు.
తన తోటి డాక్టర్ ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో.. మొబైల్ ఫోన్(ఒన్ ప్లస్ 6టి)ను కెమెరాగా చేసుకుని, చాలా పరిమిత బడ్జెట్ తో.. వీకెండ్స్ లో మాత్రమే షూట్ చేసి 'ది రాంగ్ స్వైప్' సినిమాని తెరకెక్కించాడు రవికిరణ్. ఈ సినిమాతో డాక్టర్ రవికిరణ్ తో పాటు ఈ చిత్ర నిర్మాత డాక్టర్ ప్రతిమారెడ్డి, హీరో డాక్టర్ ఉదయ్ రెడ్డి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 'ది రాంగ్ స్వైప్' చిత్రంపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించడం.. ఈ రంగంలో తాము కూడా రాణించగలమనే నమ్మకాన్ని రెట్టింపు చేసిందని డాక్టర్ రవికిరణ్ అంటున్నాడు. సుప్రసిద్ధ దర్శకులు కోదండరామిరెడ్డి, ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సోనీ లివ్ హెడ్ మధుర శ్రీధర్ రెడ్డి 'ది రాంగ్ స్వైప్' చిత్రాన్ని.. ఇటీవలకాలంలో తాము చూసిన చాలా మంచి చిత్రాల్లో ఒకటని కొనియాడడం.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకపోవడం 'ది రాంగ్ స్వైప్' ప్రత్యేకత అని వారు పేర్కొనడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని డాక్టర్ రవికిరణ్ తెలిపాడు.
"ది రాంగ్ స్వైప్" చిత్రాన్ని తెరకెక్కించిన డాక్టర్ రవికిరణ్ కు డైరెక్టర్ గా అవకాశాలు క్యూ కడుతున్నాయని తెలుస్తోంది. అయితే ఆచితూచి అడుగులు వేస్తున్న రవికిరణ్.. '6 ఎమ్.పి' పేరుతో మరో వినూత్నమైన చిత్రం రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడని సమాచారం.