
తుపాకీ పట్టుకోడు.. శత్రువుల మీదకి దూకడు.. ఏ పబ్లిక్ ఈవెంట్లోనూ కనిపించడు. కానీ, ఒక్క యుద్ధం కూడా చేయకుండానే శత్రు దేశాన్ని రెండు ముక్కలు చేసి.. ప్రపంచ పటంలో కొత్త దేశాన్ని సృష్టించగలడు. మన భారతదేశానికి అలాంటి ఒక ‘రియల్ జేమ్స్ బాండ్’ ఉన్నాడు. ఆయన పేరు రమేశ్వర్ నాథ్ కావో.. 'ఆర్.ఎన్. కావో'.
మనం సినిమాల్లో చూసే పఠాన్, టైగర్ వంటి ఏజెంట్ క్యారెక్టర్లన్నీ గన్స్ పట్టుకుని హెలికాప్టర్ల నుంచి దూకుతుంటే థ్రిల్ అవుతుంటాం. కానీ, అసలైన స్పైమాస్టర్ గన్స్ తో కాదు.. తన బ్రెయిన్ పవర్ తో, మైండ్ గేమ్‌తో దేశాన్ని కాపాడతాడు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన విదేశీ నిఘా సంస్థ ‘రా’ (R&AW - Research and Analysis Wing) స్థాపకుడు, మొదటి చీఫ్ ఈ ఆర్.ఎన్. కావో. ఈయన బయోపిక్ ను తాజాగా కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ ప్రకటించింది.
1918లో ఒక సాధారణ కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించిన ఆర్.ఎన్. కావో, ఇండియన్ ఇంపీరియల్ పోలీస్ (IPS) ఆఫీసర్‌గా తన కెరీర్ ప్రారంభించారు. ఆయనలోని అద్భుతమైన తెలివితేటలు, మనుషులను అంచనా వేసే సామర్థ్యాన్ని చూసి అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పర్సనల్ సెక్యూరిటీ టీమ్‌లో స్థానం లభించింది. 1955లో చైనా ప్రధాని జౌ ఎన్‌లై లక్ష్యంగా జరిగిన ‘కశ్మీర్ ప్రిన్సెస్’ విమాన ప్రమాద దర్యాప్తులో కావో చూపిన శ్రమ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత 1962 చైనా యుద్ధం, 1965 పాకిస్తాన్ యుద్ధాల అనుభవాలతో సరిహద్దుల అవతల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి భారత్‌కు ఒక ప్రత్యేక విదేశీ నిఘా సంస్థ అవసరమని ప్రభుత్వం భావించింది. 1968లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 'రా' (R&AW) ఏర్పాటు బాధ్యతను కావో చేతుల్లోనే పెట్టారు. కేవలం 250 మంది ఐబీ అధికారులతో ప్రారంభమైన రా సంస్థను, కొద్దికాలంలోనే మోసాద్, సీఐఏ తరహా ప్రపంచస్థాయి నిఘా వ్యవస్థగా మార్చేశారు.
ఇది కూడా చదవండి: 'ప్రాణం ఖరీదు' వెనుక ఉన్న సీక్రెట్స్.. చిరంజీవి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.?
కావో కెరీర్ లో మాస్టర్‌పీస్ ఏంటంటే.. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం. సరిహద్దు వద్ద భారత సైన్యం నేరుగా రంగంలోకి దిగకముందే, తూర్పు పాకిస్తాన్‌లో 'ముక్తి బాహిని'కి రహస్యంగా శిక్షణ ఇప్పించి, శత్రువుల ప్రతి కదలికను క్షణాల్లో ఢిల్లీకి చేరేలా ఇన్విజిబుల్ నెట్‌వర్క్ నిర్మించారు. ఫలితంగా, పాకిస్తాన్ సైన్యం లొంగిపోక తప్పలేదు. ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ రూపంలో జన్మించింది.
అయితే, ఇంతటి మహా వీరుడి కథను సినిమాగా తీయడానికి బాలీవుడ్ కి ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది? దీనికి ఒకే ఒక కారణం ఉంది. కమర్షియల్ సినిమాల్లో స్పై అంటే కార్ ఛేజ్‌లు, డిజైనర్ సూట్లు, ఫైట్లు ఉంటాయి. కానీ ఆర్.ఎన్. కావో తన జీవితంలో ఒక్కసారైనా పబ్లిక్‌గా ఫోటోలకు పోజివ్వలేదు. ఆయన ఫోటోలు కూడా వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. బయటకు చాలా ప్రశాంతంగా, క్లాసిక్‌గా కనిపిస్తారు. శత్రువుల గుండెల్లో నిశ్శబ్దంగా బాంబులు పేల్చే ఒక సీక్రెట్ మాస్టర్‌మైండ్‌ను కమర్షియల్ మాస్ ఫార్మాట్‌లో ఎలా చూపించాలో అర్థం కాక బాలీవుడ్ రైటర్లు ఏళ్ల తరబడి స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే ఉండిపోయారు.
చివరకు నితిన్ గోఖలే రాసిన "R.N. Kao: Gentleman Spymaster" పుస్తకం ఆధారంగా, ధర్మ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను 'India's Greatest Spymaster – RN Kao' పేరుతో రూపుదిద్దుతోంది. ఆయుధం పట్టకుండా దేశ సరిహద్దులను మార్చేసిన ఈ మహా నాయకుడి కథ ప్రతి భారతీయుడూ తెలుసుకోవాల్సిన నిజమైన చరిత్ర.
మీకు నచ్చవచ్చు:
మువ్వలా నవ్వకలా ముద్దమందారమా.. ప్రభాస్ కెరీర్‌లో మళ్ళీ ఇలాంటి పాట రాదేమో.!
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు.. అమ్మాయి అందాన్ని ప్రకృతితో పోలుస్తూ వేటూరి చేసిన మ్యాజిక్.!
[Indias Real James Bond, RN Kao Biopic, RAW Founder RN Kao, RN Kao Untold Facts, Indias Greatest Spymaster, RAW Founder Story, Research and Analysis Wing, Telugu Film News, Telugu News]




