ఎన్టీఆర్ కోసం బాబాయ్-అబ్బాయ్లో ఎవర్నీ అడగలేదట!
on Apr 4, 2020
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు పాత్రలో ఎవరు నటిస్తారు? ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామిని తీసుకున్నప్పుడు... ఎన్టీఆర్ పాత్రకు ఎవర్ని తీసుకుంటారు? జయలలిత జీవితం ఆధారంగా కంగనా రనౌత్ టైటిల్ రోల్లో తెరకెక్కుతున్న 'తలైవి' సినిమా కాస్టింగ్ గురించి తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లో ఎవరో ఒకరు నటిస్తే బావుంటుందనీ, నటిస్తారనీ ప్రచారం జరిగింది.
ఎన్టీఆర్ బయోపిక్ సహ నిర్మాత విష్ణూ ఇందూరి, 'తలైవి' నిర్మాతల్లో ఒకరు కావడంతో బాబాయ్ బాలయ్య, అబ్బాయ్ తారక్‌లో ఎవరో ఒకరు నటించవచ్చని ప్రేక్షకులూ అనుకున్నారు. అయితే... 'తలైవి'లో ఎన్టీఆర్ పాత్రలో నటించమని ఆయన ఫ్యామిలీ హీరోల్లో ఎవర్నీ సినిమా యూనిట్ అప్రోచ్ కాలేదట. సినిమాలో జయలలిత, ఎంజీఆర్ రిలేషన్షిప్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారట. ఎన్టీఆర్ రోల్ పెద్దగా ఉండదట. అందుకని, ఆ పాత్రకు పేరున్న నటుడి కోసం ప్రయత్నించడం లేదట. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ చాలావరకూ పూర్తి అయింది. ఈ ఏడాది జూన్ 26న సినిమాను విడుదల చేయాలనుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కుదురుతుందో? లేదో? చూడాలి మరి.