Home

»

Latest News

డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫెడరేషన్ సంచలన నిర్ణయం!

Jul 16, 2026 4:37PM

తెలుగు సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ మధ్య రాజుకున్న వివాదం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు డాన్సర్స్ అసోసియేషన్‌లోని అంతర్గత విభేదాలు చిలికి చిలికి గాలివానగా మారుతూ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌తో నేరుగా తలపడే స్థాయికి చేరుకున్నాయి. గత ఆదివారం జరిగిన సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ సందర్భంగా జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ గొడవ కాస్తా పెద్దది కావడంతో పరిశ్రమ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎన్నికల మరుసటి రోజే చిరంజీవి తన సినిమా షూటింగ్ స్పాట్‌కు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇద్దరినీ పిలిపించి మాట్లాడారు. ఇరు వర్గాల మధ్య సర్దుబాటు చేసేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. ఆ తర్వాత జానీ మాస్టర్ స్పందిస్తూ శేఖర్ మాస్టర్‌కు, తనకు ఎలాంటి విభేదాలు లేవని, అంతా సద్దుమణిగిందని, ఇదంతా కేవలం మీడియా సృష్టేనని ప్రకటించారు. అయితే ఈ వ్యవహారంపై శేఖర్ మాస్టర్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వకపోవడం గమనార్హం.

మరోవైపు ఈ వివాదంలో జానీ మాస్టర్ భార్య, డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత చేసిన వ్యాఖ్యలు మంటలకు మరింత నెయ్యి పోశాయి. అసోసియేషన్‌లోనే కొందరు 'ఇంటి దొంగలు' ఉన్నారని, వారి అక్రమాలను తాము ప్రశ్నించినందుకే తమను టార్గెట్ చేస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ క్రమంలోనే అసోసియేషన్ పదవులకు రాజీనామా చేసిన కొందరు సభ్యులు సుమలత, జానీ మాస్టర్‌లతో బహిరంగంగా వాగ్వివాదానికి దిగారు. జానీ మాస్టర్ తెలుగు డాన్సర్‌లకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని, ఆయన ఒంటెద్దు పోకడలను ప్రశ్నించినందుకే తమను బయటకు పంపించేశారని ఎదురుదాడికి దిగారు. ఇక్కడితో ఆగకుండా సుమలత నేరుగా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసోసియేషన్లన్నీ కలిస్తేనే ఫెడరేషన్ ఏర్పడుతుందని, అంతేకానీ ఫెడరేషన్ తన ఇష్టానుసారంగా రూల్స్ పెడితే తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఫెడరేషన్ కనుసన్నల్లో తాము నడవబోమని, బైలాలో లేని నిబంధనలను తమపై రుద్దాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ తీవ్రమైన ఆరోపణలను ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్యవర్గం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. గురువారం అత్యవసరంగా సమావేశమైన ఫెడరేషన్ నాయకులు డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలి వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ వివాదానికి వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. ఒకవేళ డాన్సర్స్ అసోసియేషన్ గొడవను ఇలాగే వదిలేస్తే అది ఫెడరేషన్ చేతకానితనంగా మారుతుందని, భవిష్యత్తులో మిగిలిన 24 క్రాఫ్ట్స్ యూనియన్లు కూడా ఇదే బాట పడితే ఫెడరేషన్ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే రాబోయే ఆదివారం నాటికల్లా ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.

అయినప్పటికీ సుమలత మాత్రం తన పంథా మార్చుకోలేదు. ఫెడరేషన్ కార్యాలయానికి వెళ్లి నాయకులను కలిసిన ఆమె, తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తమ యూనియన్ ఎన్నికలతో ఫెడరేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని, అక్రమార్కులను ఫెడరేషన్ వెనకేసుకొస్తోందని మండిపడ్డారు. ఒకవేళ తప్పు చేసిన వారితోనే కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వస్తే, తాము తమ పదవులకు రాజీనామా చేయడానికైనా సిద్ధమే కానీ తప్పుడు పనులను అస్సలు సమర్థించబోమని తేల్చిచెప్పారు. ఫెడరేషన్ నాయకులు గతంలో ఒకలా, ఇప్పుడు మరోలా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. టాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపుతున్న ఈ డాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి ఫెడరేషన్ పెద్దలు రాబోయే ఆదివారం ఎలాంటి ముగింపు పలుకుతారో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com