Home

»

Latest News

హైకోర్టు షాక్: డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలకు బ్రేక్!

Oct 9, 2026 3:26PM

తెలుగు డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 11న నిర్వహించ తలపెట్టిన ఎన్నికలను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిలిపివేసింది. ఎన్నికలకు ముందే వివాదాన్ని విచారించకుండా, ఎన్నికల అనంతరం విచారణకు తేదీ నిర్ణయించడంపై ట్రయల్ కోర్టు తీరును తప్పుబట్టింది. పిటిషనర్‌కు మధ్యంతర రక్షణ కల్పిస్తూ సెప్టెంబర్ 28న జారీ చేసిన డాకెట్ ఆర్డర్‌ను సస్పెండ్ చేసింది.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెప్టెంబర్ 23న తమ అసోసియేషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం సెప్టెంబర్ 24న ఫెడరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, 2026–2028 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే, ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం డిసెంబర్ 6, 2027 వరకు ఉందని, ఈ నేపథ్యంలో ఫెడరేషన్ జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ చెల్లదని పేర్కొంటూ సుమలత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అసోసియేషన్ కార్యవర్గాన్ని కొనసాగించడంతో పాటు, ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ సివిల్ దావా దాఖలు చేశారు.

పిటిషనర్ సెప్టెంబర్ 28న దావాతో పాటు ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేశారు. అయితే, ట్రయల్ కోర్టు అత్యవసర నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను నవంబర్ 3, 2026కి నిర్ణయించింది. ఎన్నికలు అక్టోబర్ 11న జరగాల్సి ఉన్నప్పటికీ, వాటిని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు.

ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషనర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 8న విచారణ చేపట్టిన ధర్మాసనం, ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో మధ్యంతర ఉపశమనం నిరాకరించడానికి గల కారణాలు స్పష్టంగా లేవని పేర్కొంది.

ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 24నే జారీ అయిందని, అక్టోబర్ 11న ఎన్నికలు జరగనున్నాయని తెలిసినప్పటికీ, విచారణను నవంబర్ 3కి వాయిదా వేయడం సమంజసం కాదని అభిప్రాయపడింది.

ఫెడరేషన్ తరఫున ప్రతివాది కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించకుండా ఆంక్షలు విధించింది. ప్రతివాదికి వ్యక్తిగత నోటీసుతో సహా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.

దసరా సెలవుల అనంతరం కోర్టు పునఃప్రారంభమయ్యే అక్టోబర్ 30న ఈ కేసును విచారణకు జాబితా చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలో ఫెడరేషన్ తన వాదనలు వినిపించాల్సి ఉంటుంది.

హైకోర్టు తాజా ఉత్తర్వులతో డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

 

 

 

[Dancers Association Elections, Telangana High Court, Telugu Dancers Association, Sumalatha vs Raghu Master, Dancers Association Sumalatha, Dancers Association Controversy, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com