‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో తేజ సజ్జా.. ఇప్పుడు మరో కొత్త అవతారంలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఇప్పటివరకు హీరోగా మెప్పించిన ఆయన తొలిసారి రియాలిటీ షో హోస్ట్‌గా మారారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియో తీసుకొస్తున్న ‘ది ట్రేటర్స్ తెలుగు’కు తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షో ట్రైలర్ విడుదల కాగా.. ఇందులో తేజ లుక్, ఆయన చెప్పే డైలాగ్స్, హోస్టింగ్ స్టైల్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
‘ది ట్రేటర్స్’ అనేది సాధారణ రియాలిటీ షోలకు భిన్నమైన మైండ్ గేమ్. మొత్తం 20 మంది సెలబ్రిటీలు ఈ గేమ్‌లో పాల్గొంటారు. వారిలో కొందరిని రహస్యంగా ‘ట్రేటర్స్’గా ఎంపిక చేస్తారు. మిగిలిన వారు ‘ఇన్నోసెంట్స్’గా ఉంటారు. ట్రేటర్స్ తమ అసలు గుర్తింపును బయటపడకుండా ఇతరులను మోసం చేస్తూ గేమ్‌లో ముందుకు సాగాలి. మరోవైపు ఇన్నోసెంట్స్.. తమ మధ్య దాగి ఉన్న ట్రేటర్స్‌ను గుర్తించి బయటకు పంపించాలి. దీంతో ఎవరి మాటను నమ్మాలి? ఎవరు మోసం చేస్తున్నారు? అనే అనుమానాలతో గేమ్ సాగుతుంది.
ఇక తేజ సజ్జా విషయానికి వస్తే.. ఇది ఆయన కెరీర్‌లోనే ఓ కొత్త ప్రయత్నం. సాధారణంగా రియాలిటీ షోలకు హోస్ట్‌లుగా సీనియర్ స్టార్లు కనిపిస్తుంటారు. కానీ ఈసారి ప్రైమ్ వీడియో యువ హీరో తేజపై నమ్మకం పెట్టుకుంది. ట్రైలర్‌లో తేజ చాలా స్టైలిష్‌గా కనిపించడంతో పాటు కంటెస్టెంట్లను గమనిస్తూ, వారి మధ్య ఉన్న నమ్మకం, అనుమానం, మోసం గురించి ఆసక్తికరంగా చెబుతున్నారు. ‘ఒక శత్రువును గుర్తించడం సులువు.. స్నేహితుడిలా నటించే ద్రోహిని గుర్తించడం ఎలా?’ అనే కాన్సెప్ట్‌తో షోపై ఆసక్తిని పెంచుతున్నారు.
మరోవైపు ‘ది ట్రేటర్స్ తెలుగు’లో చిన్మయి శ్రీపాద, హర్షవర్ధన్, ప్రగతి మహావాది, శ్రావ్య వర్మ, సాయిరోనక్, అశికా పదుకొణె, వర్షా డిసౌజా, స్వీకర్ అగస్తి తదితరులు సహా మొత్తం 20 మంది పాల్గొంటున్నారు. మొత్తం 10 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ షో నాలుగు వారాల పాటు స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 15 నుంచి ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్లు విడుదల కానున్నాయి. తెలుగులో ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
[Teja Sajja, The Traitors Telugu, The Traitors Telugu Host, Teja Sajja Host, The Traitors Telugu Trailer, Teja Sajja Reality Show, Prime Video Telugu, The Traitors Telugu Contestants, HanuMan Teja Sajja, Telugu OTT Shows, Telugu Reality Shows, Tollywood News]





