మహేశ్ చిత్రంలో తరుణ్?
on Oct 28, 2021
తెలుగునాట బాలనటుడిగానూ, కథానాయకుడిగానూ తనదైన ముద్రవేశారు తరుణ్. `ఇది నా లవ్ స్టోరి` (2018) తరువాత మళ్ళీ తెరపై కనిపించని ఈ టాలెంటెడ్ యాక్టర్.. ఇటీవల ఆహాలో స్ట్రీమ్ అయిన మలయాళ అనువాద చిత్రం `అనుకోని అతిథి` కోసం ఫహద్ ఫాజిల్ కి డబ్బింగ్ చెప్పి వార్తల్లో నిలిచారు.
ఇదిలా ఉంటే.. త్వరలో తరుణ్ మరోసారి మేకప్ వేసుకోనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. `అతడు`, `ఖలేజా` తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కథను కీలక మలుపు తిప్పే ఓ ముఖ్య పాత్ర ఉందట. ఈ వేషం కోసం తరుణ్ ని సంప్రదించారట త్రివిక్రమ్. పాత్ర నచ్చడంతో తరుణ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు బజ్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, తరుణ్ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం `నువ్వే కావాలి`తో త్రివిక్రమ్ రచయితగా స్టార్ డమ్ చూశారు. అలాగే, తరుణ్ నటించిన `నువ్వే నువ్వే`తోనే త్రివిక్రమ్ దర్శకుడిగా తొలి అడుగేశారు. ఆ అనుబంధంతోనే తరుణ్, త్రివిక్రమ్ మరోసారి కలిసి పనిచేయబోతున్నట్లు టాలీవుడ్ టాక్.
Also Read