
కింగ్ అక్కినేని నాగార్జున వెండితెరపై సృష్టించిన రొమాంటిక్ హిస్టరీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా 'నిన్నే పెళ్లాడతా' సినిమాతో నాగార్జున, టబు జోడీ వెండితెరపై కురిపించిన మ్యాజిక్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో పచ్చగానే ఉంది. 1996లో విడుదలైన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడమే కాకుండా, ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత 1998లో వచ్చిన 'ఆవిడా మా ఆవిడే' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు.
అయితే 'ఆవిడా మా ఆవిడే' తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ వెండితెరపై కలిసి కనిపించలేదు. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఇప్పుడు ఈ మోస్ట్ బ్యూటిఫుల్ జోడీ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. అయితే ఈసారి వారు పాత రొమాంటిక్ స్టైల్‌లో కాకుండా ఒకరికొకరు శత్రువులుగా మారబోతుండటం ఆసక్తికరంగా మారింది.
అక్కినేని నాగార్జున 100వ చిత్రం 'కింగ్ 100' (వర్కింగ్ టైటిల్) శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసమే దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు మళ్లీ చేతులు కలిపారు. ఈ ల్యాండ్‌మార్క్ మూవీలో టబు కేవలం ఒక సాధారణ పాత్రలో కాకుండా, ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తుండటం విశేషం.
టబుకు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో బాలీవుడ్‌లో 'మక్బూల్', 'హైదర్', 'ఫితూర్' వంటి చిత్రాల్లో క్లిష్టమైన పాత్రలు పోషించిన ఆమె, 'అంధాధున్' సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్‌తో యావత్ దేశాన్ని మెప్పించి అవార్డులను కొల్లగొట్టారు. ఇప్పుడు కింగ్ నాగార్జునకు ధీటైన విలన్‌గా ఆమె టాలీవుడ్‌లోకి స్ట్రాంగ్ రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
King 100, Nagarjuna, Tabu, TeluguOne






