Home

»

Latest News

యాక్షన్ సినిమాలకు చెక్: సూర్య సినిమాతో ట్రెండ్ మారుతుందా.?

Aug 10, 2026 6:39PM

గత కొన్నేళ్లుగా స్టార్ హీరోల సినిమాలు అంటే చాలు.. అవే రక్తం చిందించే గ్యాంగ్‌స్టర్ డ్రామాలు.. అవే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు.. అవే లార్జర్ ద్యాన్ లైఫ్ స్టోరీలు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చేయడమే దాదాపు స్టార్స్ మర్చిపోయారు. ఇలాంటి టైంలో కోలీవుడ్ స్టార్ సూర్య రూట్ మార్చి చేసిన సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ సినిమాతో మళ్ళీ మునుపటి రోజులు వస్తాయా అని ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఒకప్పుడు సౌత్ సినిమాలో కుటుంబ బంధాలు, స్వచ్ఛమైన ప్రేమకథలు థియేటర్లలో నవ్వులు, కన్నీళ్లు పూయించేవి. కానీ గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ ట్రెండ్ మొత్తం రక్తపాతం వైపే వెళ్లిపోయింది. గన్స్, బాంబులు, డార్క్ షేడ్ గ్యాంగ్‌స్టర్లు లేకుండా అసలు స్టార్ హీరోల సినిమాలు రావడమే అరుదైపోయింది. కానీ ఇప్పుడు సూర్య చేస్తున్న ఈ బోల్డ్ అటెంప్ట్ చూస్తుంటే.. 'బ్లడ్‌షెడ్ నుంచి బ్లడ్ రిలేషన్స్' వైపు మళ్లీ మన సౌత్ హీరోలను మళ్లించేలా ఉంది.

ప్రస్తుతం స్టార్ హీరోలంతా భారీ పాన్ ఇండియా యాక్షన్ ప్రాజెక్ట్ ల వెనుకే పడుతున్నారు. కానీ సూర్య మాత్రం అందుకు భిన్నంగా, ఒక ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామాని ఎంచుకున్నారు.

'విశ్వనాథ్ అండ్ సన్స్' కథలో సూర్య ఒక ఇంటర్నేషనల్ పిస్టల్ షూటర్‌గా, 40 ఏళ్ల వయసులో కూడా తన కలలను వదులుకోకుండా పోరాడే పాత్రలో కనిపిస్తున్నారు. తండ్రీ కొడుకుల అనుబంధం, చిన్నారి కోసం పడే ఆరాటం, హృదయాలను హత్తుకునే ఎమోషన్స్, మమితా బైజుతో ఏజ్-గ్యాప్ లవ్ స్టోరీ.. ఇవన్నీ కలిపి కుటుంబ సమేతంగా ఆస్వాదించేలా వెంకీ అట్లూరి రూపుదిద్దారు.

కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైంలో 'విశ్వనాథ్ అండ్ సన్స్' వస్తుండటంతో.. ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకు క్యూ కట్టే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మిగతా స్టార్ హీరోలు కూడా తమ రూట్ మార్చుకునే ఛాన్స్ ఉంది.

స్టార్ హీరోలు ఎప్పుడూ యాక్షన్ సినిమాలే కాకుండా.. మధ్య మధ్యలో ఇలా ఫ్యామిలీ సినిమాలు కూడా చేస్తే.. అన్ని వర్గాల ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడతాయి. ఒకవేళ 'విశ్వనాథ్ అండ్ సన్స్' విజయం సాధిస్తే.. భారీ యాక్షన్ సినిమాల నడుమ.. అప్పుడప్పుడు ఫ్యామిలీ సినిమాలు చేయడానికి మిగతా స్టార్స్ మొగ్గు చూపే అవకాశముంది. 

 

 

Suriya, Vishwanath and Sons, Venky Atluri, Mamitha Baiju

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com