కరోనాతో సీనియర్ నటుడు మృతి
on Apr 1, 2020
కరోనా మహమ్మారి ఒక పేరుపొందిన సీనియర్ నటుడ్ని బలికొంది. ఆయన.. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'స్టార్ వార్స్'లో కీలక పాత్రధారి అయిన ఆండ్రూ జాక్. ఆయన వయసు 76 సంవత్సరాలు. కరోనా వైరస్ సోకడం వల్ల వచ్చిన సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన మాట్ రీవ్స్ డైరెక్ట్ చేస్తోన్న 'ద బ్యాట్‌మ్యాన్' మూవీకి డైలాగ్ కోచ్‌గా పనిచేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ఇటీవల లండన్‌లో జరిగింది. అక్కడే ఆండ్రూకు కోవిడ్-19 వైరస్ సోకినట్లు సమాచారం.
స్వతహాగా బ్రిటిషర్ అయిన ఆండ్రూ 1982లో నటుడిగా పరిచయమై, ఇప్పటివరకూ 80కి పైగా సినిమాల్లో నటించారు. 'స్టార్ వార్స్: ద ఫోర్స్ అవేకెన్స్', 'స్టార్ వార్స్: ద లాస్ట్ జెడి'లో జనరల్ కలువాన్ ఎమట్ క్యారెక్టర్‌తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అలాగే 'రోగ్ వన్: ఎ స్టార్ వార్స్ స్టోరీ'లోనూ ఆయన నటించారు.
రాబర్ట్ డౌనీ జూనియర్ (చాప్లిన్, షెర్లాక్ హోమ్స్, డులిటిల్), పియర్స్ బ్రాస్నన్ (గోల్డెన్ ఐ, డై అనదర్ డే), కేట్ బ్లాన్‌చెట్ (ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్) వంటి నటులతో కటిసి నటించారు. 'థోర్: రగ్నరోక్', 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్', 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' చిత్రాల్లో థోర్ పాత్రధారి క్రిస్ హెమ్వర్త్కు కోచ్‌గా పనిచేశారు.
Also Read