Home

»

Latest News

'శ్రీనివాస మంగాపురం' ట్విట్టర్ రివ్యూ.. హీరో పాస్.. మరి డైరెక్టర్.?

Jul 30, 2026 10:04AM

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమైన చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ కూడా తెలుగు తెరకు కథానాయికగా పరిచయమయ్యారు. 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో మొదటి నుంచీ సినీ వర్గాల్లోనూ, ఘట్టమనేని అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఓవర్సీస్ ప్రీమియర్ షోలు పూర్తి కావడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

జయకృష్ణ ఘట్టమనేని నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. ప్రధానంగా ఆయన గొంతు, వాయిస్ బేస్ చాలా బాగుందని, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకునేలా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మొదటి సినిమా అయినప్పటికీ తన పాత్రకు తగినట్లుగా కష్టపడ్డాడని, అయితే హావభావాల విషయంలో మరింత మెరుగుదల అవసరమని విశ్లేషిస్తున్నారు. మరొకవైపు హీరోయిన్ రాషా తడానీ తన గ్లామర్ తో పాటు నటనతోనూ మెప్పించిందని, మొదటి తెలుగు సినిమాకే మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుందని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే, ఈ సినిమాకు సంబంధించి మెయిన్ మైనస్ దాని కథాకథనాలు అని ట్విట్టర్ రివ్యూస్ స్పష్టం చేస్తున్నాయి. దర్శకుడు అజయ్ భూపతి గత చిత్రాలైన 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం'లలో చూపించిన సాంకేతిక నైపుణ్యం, కొత్తదనం ఈ సినిమాలో పూర్తిగా లోపించాయని విమర్శలు వస్తున్నాయి. 

ఫస్టాఫ్ అంతా పాట, దాని వెనుకే ఫైట్, మళ్లీ వెంటనే మరో పాట అనే రొటీన్, అవుట్ డేటెడ్ ఫార్ములాతో సాగిపోతుందని నెటిజన్లు పేర్కొన్నారు. ఫ్లాట్‌గా సాగే కథనం వల్ల ఎక్కడా ఉత్కంఠ గానీ, కొత్తదనం గానీ కనిపించదని విమర్శిస్తున్నారు. సెకండాఫ్ లోనైనా ఏదైనా మలుపు ఉంటుందేమోనని ఆశిస్తే, అది కూడా ప్రేక్షకుల ఊహకు అందేలా రొటీన్ గానే సాగుతుందని అభిప్రాయపడుతున్నారు.

అజయ్ భూపతి లాంటి విలక్షణ దర్శకుడి నుంచి ఇలాంటి రెగ్యులర్, రొటీన్ కథను అస్సలు ఊహించలేదని పలువురు నెటిజన్లు డిజప్పాయింట్ అయ్యారు. 

మొత్తంమీద హీరోగా ఘట్టమనేని జయకృష్ణ పాస్ అయినప్పటికీ, అవుట్ డేటెడ్ కథాకథనాల వల్ల 'శ్రీనివాస మంగాపురం' థియేటర్లలో ప్రేక్షకులకు ఆశించిన స్థాయి వినోదాన్ని అందించలేకపోయిందని ట్విట్టర్ రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి. 

మరి ఇండియా టాక్ కూడా ఇలాగే ఉంటుందో లేక దీనికి భిన్నంగా ఉంటుందో చూడాలి.

 

 

Srinivasa Mangapuram Review, Jayakrishna Ghattamaneni, Rasha Thadani, Ajay Bhupathi

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com