Home

»

Latest News

నువ్వు ఎస్పీ బాలు కొడుకువి.. కాబట్టి కచ్చితంగా ఆ స్థాయిలోనే పాడాలి!

Jul 1, 2026 2:18PM

తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతుక ఒక అద్భుతం. తన తేనె లొలికే మధుర స్వరంతో దశాబ్దాల పాటు కోట్ల మంది సంగీత ప్రియులను ఊయలలూగించిన బాలు, తెలుగు పాటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. అలాంటి గాయకుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎస్పీ చరణ్ సైతం గాయకుడిగా, నిర్మాతగా, నటుడిగా తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. తాజాగా ఆయ‌న ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చరణ్ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని, బాలు గారి ఛాయల్లో పెరిగిన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని ఎమోషనల్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

త‌మ చిన్న‌త‌నంలో బాలు ఎంత బిజీగా ఉండేవారో చరణ్ ఈ ఇంటర్వ్యూలో క్లియర్‌గా వివరించారు. ఎస్పీ బాలు ఉదయాన్నే రికార్డింగుల కోసం వెళితే అర్ధరాత్రి ఎప్పుడో ఇంటికి తిరిగి వచ్చేవారని, ఆ సమయంలో ఆయన నిత్యం సినిమా పరిశ్రమకు చెందిన ఎంతోమంది దిగ్గజాలను కలుస్తూ ఉండేవారని చెప్పారు. టాలీవుడ్‌లోని టాప్ స్టార్స్, పెద్ద పెద్ద హీరోలతో కలిసి ఆయన నిరంతరం పనిచేసేవారని, ఆ క్రమంలో తాము కూడా ఎందరో ప్రముఖుల ఇళ్లకు వెళ్లేవాళ్లమని, వారు కూడా తమ ఇంటికి తరచుగా వస్తూ ఉండేవారని తెలిపారు. అయితే, చిన్నతనం నుంచే ఆ వాతావరణం అంతా చూస్తూ పెరగడం వల్ల అది తమకు చాలా సహజమైన విషయంగా అనిపించేది తప్ప, అందులో ఏదో ఒక గొప్పతనం ఉందనే స్పృహ తమకు అస్సలు ఉండేది కాదని చరణ్ చెప్పుకొచ్చారు. అందుకే తాను కానీ, తన సోదరి పల్లవి కానీ ఎక్కడా కూడా 'మేము ఎస్పీ బాలు గారి పిల్లలము' అని ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ప్రయత్నించలేదని, అదొక పెద్ద అద్భుతమని కూడా తమకు ఆ వయసులో అస్సలు తెలియదని అన్నారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి అపజయం ఎరుగని మహాగాయకుడి కొడుకుగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టడం వెనుక ఎంతటి మానసిక ఒత్తిడి ఉంటుందో చరణ్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. బాలు గారి అబ్బాయి అనగానే పరిశ్రమతో పాటు సాధారణ శ్రోతలలో కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతాయని, అందువల్ల తాను ఒక సింగర్‌గా మైక్ ముందుకు వచ్చి పాడవలసి వచ్చినప్పుడు విపరీతమైన టెన్షన్ పడ్డానని ఒప్పుకున్నారు. అయితే, ఆ సమయంలో తండ్రిగా ఎస్పీ బాలు గారు తనకిచ్చిన సపోర్ట్ ఎనలేనిదని కొనియాడారు. "నువ్వు ఎస్పీ బాలు కొడుకువి.. కాబట్టి కచ్చితంగా ఆ స్థాయిలోనే పాడాలి.. ఆ రికార్డులను అందుకోవాలి" అని తన తండ్రి తనను ఎప్పుడూ కంగారు పెట్టలేదని, అనవసరమైన ఒత్తిడిని తనపై అస్సలు ఉంచలేదని చరణ్ స్పష్టం చేశారు. కేవలం నీ కెరీర్‌ను నువ్వు సిన్సియర్‌గా, సీరియస్‌గా తీసుకుని ముందుకు సాగితే చాలని, మిగతా విషయాలన్నీ వాటంతట అవే దారిలోకి వస్తాయని ఎంతో కూల్‌గా ధైర్యం చెప్పేవారని గుర్తుచేసుకున్నారు.

తండ్రి ఇచ్చిన ఆ అండదండలతోనే ఒత్తిడిని జయించి సింగర్‌గా నిలదొక్కుకున్నానని, అప్పటి రోజులతో పోలిస్తే ఇప్పుడు తాను కాస్త బెటర్ గా పాడగలుగుతున్నానని చరణ్ వినమ్రంగా చెప్పారు. అయితే, ఈ మధ్య కాలంలో తను పాడుతున్న పాటలు వింటున్న చాలామంది సంగీత ప్రియులు, ఇండస్ట్రీ వర్గాలు 'నువ్వు అచ్చుగుద్దినట్లు నాన్నలాగే పాడుతున్నావు.. ఆ గొంతులో బాలు గారి స్వరం వినిపిస్తోంది' అని అంటుంటే తనకు ఎంతో ఆశ్చర్యంగా, అదే సమయంలో గర్వంగా అనిపిస్తూ ఉంటుందని ఎస్పీ చరణ్ ఈ ఎమోషనల్‌గా చెప్పారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com