
`సూరరై పోట్రు` (ఆకాశం నీ హద్దురా!), `జై భీమ్` చిత్రాలతో అమెజాన్ ప్రైమ్ వేదికగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్నారు కోలీవుడ్ స్టార్ సూర్య. త్వరలో ఈ వెర్సటైల్ యాక్టర్.. `ఎదర్కుమ్ తుణిందవన్` చిత్రంతో పలకరించబోతున్నారు. పాండిరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఈ చిత్రం కోసం యువ కథానాయకుడు శివ కార్తికేయన్ ఓ గీతాన్ని రచించారట. డి. ఇమాన్ సంగీతసారథ్యంలో త్వరలోనే విడుదల కానున్న ఈ పాట.. సినిమాకి ఓ హైలైట్ గా నిలుస్తుందని కోలీవుడ్ బజ్.
కాగా, పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన `మెరీనా` చిత్రంతోనే కథానాయకుడిగా తొలి అడుగు వేశారు శివ కార్తికేయన్. ఆపై ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన `కేడి బిల్లా ఖిలాడి రంగా`, `నమ్మ వీట్టు పిళ్ళై` కూడా మంచి విజయం సాధించి.. వీరిని హ్యాట్రిక్ కాంబోగా నిలిపాయి. మరి.. పాండిరాజ్ కి కథానాయకుడిగా అచ్చొచ్చిన శివ కార్తికేయన్.. గీత రచయితగానూ కలిసొస్తాడేమో చూడాలి.






