Home

»

Latest News

‘భోగి’ ట్రైలర్‌లో శర్వానంద్‌ విశ్వరూపం.. ఐదుగురు చెల్లెళ్ల కోసం గంగ చేసే పోరాటం.!

Nov 23, 2026 11:23AM

శర్వానంద్‌ అంటే ఇప్పటివరకు ఎక్కువగా గుర్తొచ్చేది లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు. కానీ ఇప్పుడు ఆయన రూటు మార్చి ఊరమాస్‌ అవతారంలోకి వచ్చేశారు. సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘భోగి’ ట్రైలర్‌ చూస్తుంటే శర్వానంద్‌ను ఇంత రా అండ్ రస్టిక్‌గా గతంలో ఎప్పుడూ చూడలేదనిపిస్తోంది. యాక్షన్‌, ఎమోషన్‌, పీరియడ్‌ బ్యాక్‌డ్రాప్‌.. ఇలా అన్ని అంశాలతో ట్రైలర్‌ ఆసక్తిని పెంచుతోంది.

1960ల కాలంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ గ్రామం నేపథ్యంలో ‘భోగి’ కథ సాగుతున్నట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. ఆ ఊరిపై దొరలు, పెత్తందారుల ఆధిపత్యం ఉంటుంది. ప్రతి అమావాస్య తర్వాత గ్రామంలో యువకులు అదృశ్యమవుతుండటం, దాని వెనుక ఉన్న రహస్యం కథలో కీలకంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఏదో చూసిన గంగను నోరు మూసుకుని ఉండాలని హెచ్చరించడం ట్రైలర్‌ ఆరంభంలోనే ఉత్కంఠను పెంచుతోంది.

ఈ సినిమాలో శర్వానంద్‌ గంగ అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా, కుటుంబాన్ని ఎంతో ప్రేమించే వ్యక్తిగా ఆయన పాత్రను పరిచయం చేశారు. అయితే తన కుటుంబానికి, ఊరికి అన్యాయం జరుగుతున్నప్పుడు మాత్రం గంగలోని మరో మనిషి బయటకు వస్తాడు. దొరల దౌర్జన్యాలను ఎదిరిస్తూ చేసే పోరాటమే కథలో ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా శర్వానంద్‌ బాడీ లాంగ్వేజ్‌, తెలంగాణ యాస, యాక్షన్‌ సన్నివేశాలు ఆయన పాత్రలోని తీవ్రతను చూపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్‌ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన శర్వా.. ఈసారి పూర్తిగా కొత్త అవతారంలో కనిపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: డింపుల్ హయాతికి క్షమాపణలు చెప్పిన సంపత్ నంది.!

ట్రైలర్‌లో అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్‌ హయాతి పాత్రలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అనుపమ కందుల సులోచనారాణి పాత్రలో కనిపిస్తుండగా.. గంగలోని అగ్గిని గుర్తుచేస్తూ ఆమె చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. మరోవైపు డింపుల్‌ పాత్ర గంగను మరింత తీవ్రంగా పోరాడేలా ప్రేరేపిస్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా పాటలు, గ్లామర్‌ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న డింపుల్‌కు ఇందులో ఎలాంటి పాత్ర దక్కిందనేది ఆసక్తికరం.

మొత్తంగా చూస్తే ‘భోగి’ శర్వానంద్‌ కెరీర్‌లో మరో భిన్నమైన ప్రయత్నంగా కనిపిస్తోంది. మాస్‌ యాక్షన్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలను కూడా కలిపినట్లు ట్రైలర్‌ సూచిస్తోంది. నవంబర్‌ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి గంగగా శర్వానంద్‌ బాక్సాఫీస్‌ దగ్గర ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి.

మీకు నచ్చవచ్చు:
18 ఏళ్లైనా ఆ ప్రేమ తగ్గలేదు.. సమీరారెడ్డి కామెంట్స్ వైర‌ల్‌.!
అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం.. ఆసుపత్రిలో జబర్దస్త్ కమెడియన్లు!

 

 

 

[Bhogi Trailer, Sharwanand, Sampath Nandi, Anupama Parameswaran, Dimple Hayathi]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com