Home

»

Latest News

'బ్యాడ్ ఐడియాతో సినిమా తీయడం అంటే బూడిదలో పన్నీరు పోసినట్టే’.!

Aug 30, 2026 12:14PM

సినిమా వైఫల్యం ఎడిటింగ్ టేబుల్‌పై మొదలవదు.కథ పుట్టిన క్షణంలోనే మొదలవుతుంది. “బ్యాడ్ ఐడియాతో కథను ఎంత గొప్పగా అభివృద్ధి చేసి, షూటింగ్‌కు సిద్ధం చేసినా, బూడిదలో పన్నీరు పోసినట్టే.”సినిమా నిర్మాణంలో అత్యంత ఖరీదైన తప్పు ఏమిటి?బడ్జెట్ కొంత పెరగడం కాదు.కొన్ని షూటింగ్ రోజులు వృథా కావడం కాదు.పోస్ట్‌ప్రొడక్షన్‌లో ప్యాచ్‌వర్క్‌లు, రీషూట్‌లు రావడం కాదు.అన్నింటికంటే ఖరీదైన తప్పు,మొదటి నుంచే బలహీనమైన కథా ఆలోచనను ప్రేమించడం.ఒక బలహీనమైన ఐడియాను పట్టుకుని దర్శకుడు, రచయిత నెలల తరబడి ప్రయాణిస్తారు. దానికి కథను కడతారు. కథనాన్ని అల్లుతారు. పాత్రలను సృష్టిస్తారు. బౌండెడ్ స్క్రిప్ట్ రాస్తారు. హీరో, హీరోయిన్, విలన్‌లను ఖరారు చేస్తారు. లొకేషన్లు వెతుకుతారు. బడ్జెట్ వేస్తారు. క్రూను సమీకరిస్తారు. చివరకు షూటింగ్ ప్రారంభిస్తారు.అన్నీ పూర్తయ్యాక ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని,“ఏదో మిస్ అయింది”అంటారు.

కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయి ఉంటుంది.ఎందుకంటే అప్పటికి సినిమా శరీరం మాత్రమే మిగిలి ఉంటుంది. ప్రాణం మాత్రం కథ పుట్టినప్పుడే పోయి ఉంటుంది.ఐడియా అంటే కథ కాదు.సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు మనం తరచుగా అంటుంటాం.“ఐడియా చాలా బాగుంది!”కానీ అసలు ప్రశ్న?బాగున్న ఐడియా అంటే ఏమిటి?ఒకే వాక్యంలో చెప్పగలిగే కాన్సెప్టా?కొత్తదనమున్న పాయింటా?షాకింగ్ ట్విస్టా?హీరోకు ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషనా?లేక ప్రేక్షకుడిలో భావోద్వేగాన్ని రగిలించగలిగే అవకాశమా?నిజానికి సినిమా ఐడియా వీటిలో ఏ ఒక్కటి కాదు.ఒక ఐడియాలో పూర్తి సినిమా దాగి ఉందా లేదా అన్నదే అసలు ప్రశ్న.ఉదాహరణకు:“ఒక పోలీస్ తన సొంత అన్నను అరెస్ట్ చేయాల్సి వస్తుంది.”ఇది వినడానికి ఆసక్తికరమైన ఐడియా.

కానీ ఇక్కడి నుంచే నిజమైన కథ మొదలవుతుంది.ఎందుకు అరెస్ట్ చేయాలి?అన్న చేసిన నేరం ఏమిటి?అతను నిజంగానే నేరస్థుడా?పోలీసు తన అన్నను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితికి ఎందుకు వస్తాడు?అరెస్ట్ చేస్తే కుటుంబం ఏం కోల్పోతుంది?అరెస్ట్ చేయకపోతే పోలీసు ఏం కోల్పోతాడు?అతని వృత్తి ప్రమాదంలో పడుతుందా?అతని కుటుంబం చీలిపోతుందా?అన్నను కాపాడటం ధర్మమా?చట్టాన్ని కాపాడటం ధర్మమా?కాన్ఫ్లిక్ట్, స్టేక్స్, ఎమోషన్, క్యారెక్టర్ జర్నీ, థీమ్ ఇవన్నీ ఆ ఐడియాలోనే విత్తనాలుగా ఉండాలి.అవి లేకపోతే అది సినిమా ఐడియా కాదు.అది కేవలం ఒక సంఘటన.“నా ఐడియా గొప్పది” అనే ప్రమాదకరమైన అహంకారంసినిమా ప్రపంచంలో ఒక విచిత్రమైన మానసిక స్థితి తరచూ కనిపిస్తుంది.“ఈ ఐడియా నాదే.”“ఇలాంటి కథ ఇంతవరకు ఎవరూ చెప్పలేదు.”“నాకు ఈ కథ చాలా నచ్చింది.”“ఈ పాత్రను నేను చాలాప్రేమిస్తున్నాను.”“ప్రేక్షకులకు అర్థం కాకపోయినా పర్లేదు.”

ఇలాంటి మాటలు వినిపించినప్పుడు ఒక సృజనకర్త అప్రమత్తం కావాలి.ఎందుకంటే రచయితకు నచ్చినది ప్రేక్షకుడికి నచ్చుతుందనే గ్యారెంటీ లేదు.దర్శకుడికి కొత్తగా అనిపించినది ప్రేక్షకుడికి కొత్తగా అనిపించకపోవచ్చు.రచయితకు అత్యంత భావోద్వేగంగా అనిపించిన సన్నివేశం ప్రేక్షకుడి కళ్లలో నీళ్లు తెప్పించాలంటే, ఆ భావోద్వేగానికి స్క్రీన్‌ప్లే కారణాన్ని నిర్మించాలి.అందుకే రచయిత తనను తాను అడగాల్సిన ప్రశ్న?“నేను ఈ కథను ఎందుకు ప్రేమిస్తున్నాను?”కాదు. “ప్రేక్షకుడు ఈ కథను ఎందుకు ప్రేమించాలి?”అనేదే.

‘The Good Dinosaur’ చెప్పే గొప్ప పాఠం ఇక్కడ అవసరం.“The Good Dinosaur” కథా అభివృద్ధి కూడా ఐడియా నుంచి సినిమాగా మారే ప్రయాణంలో ఒక ముఖ్యమైన పాఠాన్ని చెబుతుంది.“ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనకపోతే?”అనే ఒక ఆసక్తికరమైన What If? ఆలోచనతో సినిమా ప్రయాణం మొదలైంది.ఇది చెడ్డ ప్రశ్న కాదు. నిజానికి అద్భుతమైన ప్రిమైజ్.

కానీ ప్రిమైజ్ నుంచి పూర్తి సినిమాగా మారే క్రమంలో కథ అనేక మలుపులు తిరిగింది. కథ తన సహజమైన దారిని కోల్పోతోందనే భావనతో భారీ స్థాయిలో అభివృద్ధి, మార్పులు అవసరమయ్యాయి.ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా స్పష్టంగా ఉంది.గుడ్ ఐడియా కూడా బ్యాడ్ డెవలప్‌మెంట్ వల్ల చనిపోవచ్చు.
అదే సమయంలో,బ్యాడ్ ఐడియాను ఎంత గొప్పగా డెవలప్ చేసినా దానికి ఒక పరిమితి ఉంటుంది.

అందుకే దర్శకుడు తనను తాను ఒక దశలో ఆపుకుని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే?“నేను ఈ కథను రక్షిస్తున్నానా? లేక సినిమాను రక్షిస్తున్నానా?”“ఇంత చేశాం కదా…” ఇదే అసలు ఉచ్చు అని చెప్పవచ్చు.ఒక దర్శకుడు ఆరు నెలలు కథపై పనిచేస్తాడు.మూడు నెలలు బౌండెడ్ స్క్రిప్ట్‌పై కష్టపడతాడు,మరో నెల క్యాస్టింగ్‌పై వెచ్చిస్తాడు,లొకేషన్లు చూస్తాడు,ప్రొడక్షన్ డిజైన్ మొదలవుతుంది.బడ్జెట్ ఖరారవుతుంది.అప్పుడొక రోజు మనసులో చిన్న అనుమానం మొదలవుతుంది.“ఎక్కడో తేడా కొడుతోంది అని.అప్పుడు చాలామంది చేసే పొరపాటు,“ఇంత చేశాం కదా, ఇంకొంచెం చేస్తే బాగుపడుతుంది.”ఇదే ప్రమాదకరమైన మలుపు.
ఇక్కడే ‘Sunk Cost Fallacy’మొదలవుతుంది.

అప్పటికే ఖర్చు చేసిన సమయం, డబ్బు, శ్రమను కాపాడుకోవడానికి మరింత సమయం, మరింత డబ్బు ఖర్చు చేస్తారు.చివరికి,చెడ్డ సినిమాను కాపాడటానికి పెద్ద మొత్తాన డబ్బును ఖర్చు చేస్తారు.నిర్మాతకు నష్టం అక్కడ మొదలవుతుంది.అందుకే కథను ఐడియా దశలోనే వదిలేయడం వైఫల్యం కాదు.అది తెలివైన ఆర్థిక నిర్ణయం.
“Kill Your Darlings” ఎందుకు అవసరం?రచయితకు ఎంతో ఇష్టమైన సన్నివేశాన్ని అవసరమైతే తొలగించగలిగే ధైర్యం ఉండాలి.దర్శకుడు తనకు ఎంతో నచ్చిన పాత్రను కథ నుంచి తొలగించగలగాలి.హీరో తనకు నచ్చిన ఎలివేషన్ సీన్‌ను వదులుకోగలగాలి.ఎందుకంటే?

సినిమాకు ఉపయోగపడనిదేదైనా, ఎంత అందంగా ఉన్నా చివరికి అది చెత్తే.ఒక అద్భుతమైన సన్నివేశం కథను ముందుకు తీసుకెళ్లకపోతే, అది స్క్రీన్‌ప్లేకు అలంకారం కాదు,భారం.ఒక అద్భుతమైన పాత్ర కథానాయకుడి ప్రయాణాన్ని మార్చకపోతే, అది పాత్ర కాదు,స్క్రీన్‌ప్లేలో అదనపు బరువు.సినిమా అంటే మనకు నచ్చినవన్నీ తెరపై పెట్టడం కాదు.సినిమా అంటే కథకు అవసరమైనవాటిని మాత్రమే మిగిల్చడం.కథను ఓకే చేయడం కాదు,కథను పరీక్షించడం ముఖ్యం

సినిమా వ్యాపార విజయానికి మొదటి మెట్టు కథను తొందరగా ఓకే చేయడం కాదు.కథలోని బలహీనతలను షూటింగ్‌కు ముందే గుర్తించడం.ఒక మంచి దర్శకుడు, ఒక మంచి నిర్మాత కొన్ని అసౌకర్యమైన ప్రశ్నలను కథపై విసరాలి.ఈ సినిమా ఎందుకు తీయాలి?ఇది ఇప్పుడే ఎందుకు చెప్పాలి?ప్రేక్షకుడు ఈ కథ కోసం థియేటర్‌కు ఎందుకు రావాలి?ఈ కథలో మనకు తెలియని కొత్త విషయం ఏమిటి?హీరో ఈ కథలో ఏం కోల్పోతున్నాడు?ఈ కథను తీసేస్తే మనం ఏం కోల్పోతాం? ఇవన్నింటికంటే భయంకరమైన ప్రశ్న ఒకటి ఉంది. “ఈ సినిమా లేకపోతే ప్రపంచానికి ఏమి నష్టం?”

ఆ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం దొరకకపోతే,సినిమా చేయకపోవడమే బహుశా తెలివైన నిర్ణయం.
నిర్మాతకు “సినిమా చేయకండి” అని చెప్పగలిగే వ్యక్తి కూడా కావాలినిర్మాత పెట్టుబడి పెట్టేది కేవలం షూటింగ్‌లో కాదు.స్టోరీ డెవలప్‌మెంట్,రైటర్ ఖర్చు,డైరెక్టర్ ఖర్చు,క్యాస్టింగ్,లొకేషన్లు,ఎక్విప్‌మెంట్,క్రూ,
ట్రావెల్,పోస్ట్‌ప్రొడక్షన్,మార్కెటింగ్,ఒక్కో దశలో పెట్టుబడి పెరుగుతూనే ఉంటుంది.అందుకే కథను ఐడియా దశలోనే చంపడం ఖరీదైన నిర్ణయం కాదు.నిజానికిఅది అత్యంత చవకైన నిర్ణయం.పది రోజులకు ఒక కథను వదిలేయడం చవక.పది నెలల తర్వాత వదిలేయడం ఖరీదు.షూటింగ్ పూర్తయ్యాక వదిలేయడం అత్యంత దారుణం.ఎందుకంటే కథను చంపే ధైర్యం లేకపోతే, చివరికి సినిమా నిర్మాతను చంపుతుంది.ప్రతి దర్శకుడు, ప్రతి రచయిత చేయాల్సిన “10 పరీక్షలు”
1. నాలుగు పేజీల ఒక వాక్య పరీక్ష
నాలుగు పేజీల కథను  ఒక వాక్యంలో స్పష్టంగా చెప్పగలమా?
2. ఐదు వాక్యాల పరీక్ష
ఐదు వాక్యాల్లో కథ యొక్క ఆత్మను చెప్పగలమా?
3. హీరో పరీక్ష
హీరో ఎవరు?
అతనికి నిజంగా ఏం కావాలి?
4. సంఘర్షణ పరీక్ష
హీరోకు అడ్డుగా ఎవరు ఉన్నారు?
అతని ప్రయాణాన్ని ఏ శక్తి ఆపుతోంది?
5. స్టేక్స్ పరీక్ష
హీరో ఓడిపోతే ఏం కోల్పోతాడు?
కోల్పోయేది ఏమీ లేకపోతే ప్రేక్షకుడికి టెన్షన్ ఎందుకు వస్తుంది?
6. ఎమోషన్ పరీక్ష
ప్రేక్షకుడు ఎక్కడ ఏడవాలి?
ఎక్కడ నవ్వాలి?
ఎక్కడ భయపడాలి?
ఎక్కడ ఉత్కంఠకు గురికావాలి?
ఎక్కడ హీరోతో కలిసి ప్రయాణించాలి?
7. సన్నివేశాల పరీక్ష
ఈ కథ నుంచి కనీసం పది గుర్తుండిపోయే గొప్ప సన్నివేశాలు పుడుతున్నాయా?
ఐడియా గొప్పదా కాదా అన్నది ఒక లైన్ చెప్పదు.
అది ఎన్ని గొప్ప సన్నివేశాలకు జన్మనిస్తుందో చెబుతుంది.
8. సెకండాఫ్ పరీక్ష
ఇంటర్వెల్ తర్వాత కథకు కొత్త సమస్య పుడుతుందా?
లేక మొదటి భాగంలో మొదలైన సమస్యనే సాగదీస్తున్నామా?
9. క్లైమాక్స్ పరీక్ష
క్లైమాక్స్ హీరో నిర్ణయం వల్ల వస్తుందా?
లేక కథ అతన్ని అక్కడికి లాక్కెళ్లిందా?
గొప్ప క్లైమాక్స్ అనేది సంఘటన కాదు—హీరో తీసుకున్న అనివార్యమైన నిర్ణయం.
10. “Why This Film?” పరీక్ష
చివరగా ఒక్క ప్రశ్న?
“ఈ కథను నేను ఎందుకు చెప్పాలి?”ఈ ఒక్క ప్రశ్నకు కూడా రచయిత నిజాయితీగా సమాధానం చెప్పలేకపోతే…స్క్రిప్ట్ రాయడం ప్రారంభించకపోవడమే మంచిది.ఎందుకంటే మంచి సినిమా రాయడం కంటే,
తీయకూడని సినిమాను ముందుగానే గుర్తించడం గొప్ప సృజనాత్మక విజ్ఞానం.కథ పుట్టిన క్షణంలోనే సినిమా భవిష్యత్తు రాయబడుతుంది.అక్కడే దానికి ప్రాణం పోయవచ్చు.అక్కడే దాని ప్రాణం తీయవచ్చు.
కాబట్టి షూటింగ్‌కు ముందు కథను చంపడానికి భయపడకండి.ఎందుకంటే?“బ్యాడ్ ఐడియాతో సినిమా తీయడం  అంటే బూడిదలో పన్నీరు పోసినట్టే!”

By Prakash Surya is a distinguished Writer and Award-winning Filmmaker, honored with two Nandi Awards. A rigorous D.F.Tech academic background shapes his expertise as a dedicated researcher and Screenwriter focused on contemporary Cinema. His writings aim to deepen Film appreciation and foster meaningful scholarly dialogue in the Cinematic arts.

courtesy: Prakash Surya

 

 

[Screenplay writing tips, Movie story development process, Filmmaking common mistakes, Film production decision making, Concept vs Story in filmmaking, Cinematic storytelling guide]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com