ఒన్ అండ్ ఓన్లీ అబ్సెషన్.. 'రెడ్'!
on Feb 28, 2020
"క్రైం హిస్టరీలో ఇలాంటి కేసు చూడటం ఇదే ఫస్ట్ టైం" అని ఇన్స్పెక్టర్గా నటిస్తోన్న సంపత్ రాజ్ చెప్పడంతో 'రెడ్' టీజర్ మొదలైంది. ఆ కేసే 'రెడ్' సినిమాకు కీలకమని భావించవచ్చు. బహుశా ఆ కేసు చుట్టూనే కథ నడుస్తుందని మనం ఊహించగలం. ఏమిటా కేసు? ఆ కేసుకీ, ఇద్దరు హీరోలకూ సంబంధం ఏమిటనేది ఆసక్తికరం. "సిద్ధార్థ్, ఆదిత్య.. ఇద్దరికీ ఎటువంటి సంబంధం లేదు. డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్స్, డిఫరెంట్ డిఫరెంట్ వరల్డ్స్" అంటూ చెప్పే గొంతు సబ్ ఇన్స్పెక్టర్గా నటిస్తోన్న నివేతా పేతురాజ్ది. 'రెడ్' మూవీలో ఈ రెండు క్యారెక్టర్లనీ హీరో రామ్ పోషిస్తున్నాడు. సిద్ధార్థ్ జోడీగా మాళవికా శర్మ, ఆదిత్య సరసన అమృతా అయ్యర్ కనిపిస్తున్నారు. సత్య, పోసాని కృష్ణమురళి పాత్రలు వినోదానికి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయి. నాజర్ జడ్జి పాత్రలో కనిపిస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం 5 గంటలకు 'రెడ్' టీజర్‌ను తన 'రామ్ పోతినేని' హ్యాండిల్లో యూట్యూబ్‌లో రిలీజ్ చేశాడు రామ్. 1 నిమిషం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్లో రామ్ చేస్తున్న రెండు పాత్రల్నీ రివీల్ చేశారు. గడ్డంతో చూపులకు ఇద్దరూ ఒకేలా ఉన్నప్పటికీ, మేకప్ పరంగా ఇద్దరినీ భిన్నంగా చూపించే ప్రయత్నం చేసినట్లు కంపిస్తుంది. ఇద్దరి హెయిర్ స్టైల్స్ భిన్నంగా కనిపిస్తున్నాయి. సిద్ధార్థ్ పాత్ర కళ్లజోడు పెట్టుకుంటుంది. "వాంటెడ్‌గా నన్ను ఇందులో ఇరికించాలని చూస్తున్నారు. ఎందుకంటే లైఫ్‌లో వాడికున్న ఒన్ అండ్ ఓన్లీ అబ్సెషన్ నేనే" అని రామ్ అంటున్నాడు. డైలాగ్ డిక్షన్‌ను బట్టి ఆ మాటలు అంటోంది సిద్ధార్థ్ పాత్రధారి అనిపిస్తోంది. ఆదిత్యను ఉద్దేశించి అవి చెబ్తున్నాడని భావించాలి.
నిజానికి సిద్ధార్థ్, ఆదిత్య కవలలు.. అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంటారు.. తల్లిదండ్రులు విడిపోతే, ఒకరు తల్లి వద్దా, ఇంకొకరు తండ్రి వద్దా పెరుగుతారు. తల్లి దగ్గర పెరిగిన ఆదిత్య గ్యాంబ్లర్‌గా మారితే, తండ్రి దగ్గర పెరిగిన సిద్దార్థ్ బిజినెస్‌మేన్ అవుతాడు. ఒక కేసు వాళ్ల జీవితాల్ని మార్చేస్తుంది. పోలీసుల ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తోంది కాబట్టి ఇది క్రైం మేళవించిన యాక్షన్ థ్రిల్లర్‌గా భావించవచ్చు. మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ 'రెడ్'కు ఎస్సెట్స్ అని చెప్పాలి. రామ్, కిశోర్ తిరుమల కాంబినేషన్లో ఇదివరకు 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగి' సినిమాలు వచ్చాయి. ఏప్రిల్ 9న రిలీజ్ కానున్న ఈ మూవీతో వాళ్లు భారీ హిట్‌పై కన్నేశారు.