మిస్కిన్ దెబ్బకు డైరెక్టర్‌గా మారిన విశాల్!
on Mar 11, 2020
హీరోగా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకున్న విశాల్ ఇప్పడు అనూహ్య పరిస్థితుల్లో డైరెక్టర్‌గా మారుతున్నాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై అతను హీరోగా నటిస్తూ నిర్మించిన 'తుప్పరివాలన్' సినిమా ఘన విజయం సాధించింది. తెలుగులో 'డిటెక్టివ్'గా విడుదలైన ఆ సినిమా ఇక్కడా హిట్టయింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేశాడు విశాల్. తమిళంలో 'తుప్పరివాలన్ 2'గా, తెలుగులో 'డిటెక్టివ్ 2'గా ఆ సినిమాని విడుదల చేయాలని సంకల్పించాడు. ఒరిజినల్‌ను డైరెక్ట్ చేసిన మిస్కిన్‌ను ఈ సినిమాకీ డైరెక్టర్‌గా ఎంచుకున్నాడు. లండన్ నేపథ్యంలో నడిచే కథ కాబట్టి అక్కడే షూటింగ్ ప్రారంభించారు. అయితే కొద్ది రోజుల షూటింగ్ తర్వాత తానింక ఈ సినిమాకు పనిచేయనని మిస్కిన్ తప్పుకున్నాడు.
దాంతో విశాల్ బృందం షాక్‌కు గురైంది. ఆ సినిమాను ఎలాగైనా పూర్తి చేయాలనే పట్టుదలతో తనే డైరెక్టర్‌గా మారాడు విశాల్. తానెందుకు మెగాఫోన్ చేపట్టాడో బుధవారం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో అతడు వెల్లడించాడు. విశాల్ చెప్పిన ప్రకారం..
డైరెక్టర్ మిస్కిన్ కెనడా, యు.కె.లలో కథ రాస్తానంటే విశాల్ అంగీకరించాడు. అందుకు గాను మిస్కిన్ వేసిన బిల్లు రూ. 35 లక్షలు. సరైన లొకేషన్లను ఎంపిక చేయకుండానే షూటింగ్ ప్రారంభించిన మిస్కిన్ ఇప్పటిదాకా ఖర్చు పెట్టించింది అక్షరాలా రూ. 13 కోట్లు. యు.కె.లో ఒక రోజు షూటింగ్‌కు అయ్యే ఖర్చు రూ. 15 లక్షలు కాగా, మిస్కిన్ రోజుకు కేవలం మూడు నాలుగు గంటలసేపే పనిచేసేవాడు. కాస్ట్‌ను తగ్గించుకోనే ఉద్దేశంతో రోజులు రెండు సీన్లను కానీ లేదా డే అండ్ నైట్ షూటింగ్ కానీ పెట్టుకుందామంటే అతను వినలేదు. డిసెంబర్ 11న షూటింగ్‌ను మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు మిస్కిన్. జనవరి 4న ఇండియాకు వచ్చేశాడు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో ఆఫీసుకు వచ్చి తానిక ఈ సినిమాకి పనిచేయనని చెప్పి వెళ్లిపోయాడు. అలాంటి సమయంలో వడ్డీలకు డబ్బులు తెచ్చి సినిమా తీసే నిర్మాత పరిస్థతి ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందేననీ, తన సినిమాను మధ్యలో వదిలేయడం ఇష్టంలేక, ఎలాగైనా పూర్తిచేసి, విడుదల చేయాలనే సంకల్పంతో డైరెక్టర్‌గా మారానని విశాల్ వెల్లడించాడు. ఇలాంటి వ్యక్తులతో నిర్మాతలు అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వివరాలు వెల్లడి చేశాననీ, అంతేతప్ప ఒక వ్యక్తి ఇమేజ్ను డామేజ్ చేసే ఉద్దేశంతో ఇవి బయటపెట్టడం లేదని చెప్పాడు.
కాగా బుధవారం సాయంత్రమే 'తుప్పరివాలన్ 2' ఫస్ట్ లుక్‌ను విశాల్ విడుదల చేయడం గమనార్హం.