రవితేజం... ప్రేక్షకులకు ఉల్లాసం ఉత్తేజం!
on Jan 26, 2019
రవితేజ...
నాలుగు అక్షరాల పేరు!
నలుదిక్కులా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని హుషారు!
నాలుగు కుటుంబాల వారసులకు మాత్రమే కాదు, ప్రతిభావంతులకు ప్రేక్షకులు పట్టం కడతారని చూపించిన జోరు!
నాలుగు పదుల వయసులోనూ నిత్య నూతన యవ్వనుడిగా, కుర్రకారుకు స్ఫూర్తినిచ్చేలా కదిలే స్పీడు!
వినోదానికి పెట్టింది పేరు, కుటుంబానికి సరిపడా ఆనందాన్ని ఇచ్చే నటుడు, మాస్ ప్రేక్షకులకు మహారాజు!
రవితేజ గురించి కొత్తగా చెప్పేదేముంది? అందరికీ తెలిసిందే. అవకాశాల కోసం కృష్ణానగర్ వీధుల వెంట తిరిగాడు. ఫిలింనగర్ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాడు. కానీ ఏ రోజు అధైర్యాన్ని తన దరికి రానివ్వలేదు. ఏదో ఒక రోజు తనలో నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేస్తానని ధైర్యంగా ఉన్నాడు. సహాయ దర్శకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశాడు. తర్వాత హీరో అయ్యాడు. హీరోగా రవితేజాన్ని వెండితెరపై చూపించాడు. ఆ తేజం ప్రేక్షకులకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని అందించింది. విజిల్స్ వేయించింది. చప్పట్లు కొట్టించింది. కృష్ణానగర్ వీధుల వెంట తిరిగే కుర్రాళ్లకు ధైర్యాన్ని అందించింది.
జయాపజయాలు ప్రతి ఒక్కరి ప్రయాణంలో ఉంటాయి. తేజ ప్రయాణంలోనూ ఉన్నాయి. అతను నటించిన చాలా సినిమాలు విజయాలు సాధించాయి. కొన్ని పరాజయం పాలయ్యాయి. విజయాలు వచ్చినప్పుడు గర్వం ప్రదర్శించలేదు రవితేజ. అలాగే, అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోలేదు. నిర్మల వ్యక్తిత్వంతో నలుగురిని చిరునవ్వుతో పలకరించాడు. పరాజయాలు వచ్చిన ప్రతిసారి విజయంతో తన ప్రతిభ చాటాడు. విజయాలు వచ్చినా... అపజయాలు తన దారికి అడ్డుగా నిలిచినా... ఎప్పుడూ ప్రేక్షకులకు మంచి చిత్రాలు అందించాలని ప్రయత్నించాడు.
రవితేజ పేరు చెబితే ప్రేక్షకులకు హుషారు, జోరు గుర్తొస్తాయి. అలాగని, రవితేజ వినోదాత్మక చిత్రాలను మాత్రమే పరిమితం కాలేదు. శంభో శివ శంభో వంటి ఎమోషనల్ సినిమా చేశాడు. విక్రమార్కుడు చిత్రంలో విక్రమ్ రాథోడ్ పాత్రలో వీరత్వం చూపించాడు. రాజా ది గ్రేట్ అంటూ ఓ ప్రయోగం చేశాడు. అంధుడి పాత్రలో నటించాడు. అలా నాయకుడిగా తనకంటూ ఓ పేరు వచ్చిన తర్వాత పేరున్న దర్శకులతో పనిచేయాలని నియమాలు పెట్టుకోలేదు. హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, కేఎస్ రవీంద్ర (బాబీ), పరశురాం, సంపత్ నంది, సురేందర్ రెడ్డి తదితర దర్శకులకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు. పరాజయాలకు ఇతరులను బాధ్యులను చేయలేదు. తామంతా నమ్మి సినిమా చేశామని, ప్రేక్షకులకు నచ్చలేదని సౌమ్యంగా చెప్పేవాడు. కథానాయకుడిగా, వ్యక్తిగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు రవితేజ.
రవి తేజం వెండితెరపై ఇలాగే ప్రసరించాలని..
ప్రేక్షకులకు అంతులేని ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందించాలని కోరుకుంటూ....
తెలుగువన్ డాట్ కామ్ తరఫున మాస్ మహారాజ్ కి జన్మదిన శుభాకాంక్షలు.
Also Read