Home

»

Latest News

Rashmika: రష్మిక భారీ రిస్క్..ఫ్యాన్స్ కోసం 80 అడుగుల నుంచి దూకేసింది

Jul 9, 2026 11:01AM

 


పెళ్లి తర్వాత అయినా సరే తగ్గేదెలే అంటూ రష్మిక వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతుంది. హజ్బండ్ విజయ్ దేవరకొండతో 'రణబలి' చేస్తుండగా తన లిస్ట్ లో ఉన్న మరో మూవీ 'మైసా'. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతుండగా రష్మిక గ్లామర్ రోల్ లో  కాకుండా, వ్యవస్థపై ధిక్కార స్వరం వినిపించే గోండు తెగకి చెందిన ఒక పవర్‌ఫుల్ గిరిజన మహిళగా, నక్సలైట్ క్యారక్టర్ కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. భావోద్వేగాలు, కోపం, ఆవేశం కలగలిపిన ఈ విలక్షణమైన రోల్ కోసం రష్మిక పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు.

'మైసా' లో హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సహజత్వం కోసం రష్మిక మందన్న ఏకంగా అంతర్జాతీయ స్థాయి యాక్షన్ డైరెక్టర్ ఆండిలాంగ్, అలాగే ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ కెచా ఖంపక్డీ పర్యవేక్షణలో థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో వారం రోజుల పాటు ప్రత్యేక కంబాట్ శిక్షణ తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆమె ప్రతిరోజూ ఏకంగా 8 గంటల పాటు కఠోర శ్రమతో కూడిన మార్షల్ ఆర్ట్స్, గిరిజనుల సాంప్రదాయ పోరాట విధానాలపై కసరత్తులు చేయడం విశేషం. శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా మారాలని నిర్ణయించుకుని ఈ రిస్క్ తీసుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన షెడ్యూల్‌ను కేరళలో పూర్తి చేశారు. కొచ్చిలోని దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, నిరంతరం కురిసే వర్షాల మధ్య దాదాపు 16 రోజుల పాటు ఈ యాక్షన్ షెడ్యూల్ సాగింది. ఈ షూటింగ్ సమయంలో రష్మిక నిజంగానే ప్రాణాలకు తెగించి సాహసాలు చేసింది. కేరళలోని ప్రసిద్ధ అతిరపల్లి జలపాతం వద్ద ఎలాంటి డూప్ సహాయం తీసుకోకుండా, ఏకంగా 80 అడుగుల ఎత్తు నుండి కిందకు జంప్ చేసి చిత్ర యూనిట్‌తో పాటు సినీ వర్గాలని  సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ నీటిలోని భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం రష్మిక తన మోకాళ్లు, కాళ్లకు ప్రత్యేకమైన మెడికల్ టేపింగ్ వేసుకుని మరీ అత్యంత ప్రమాదకరమైన స్టంట్స్ పూర్తి చేసింది.


Also read: మన్మధ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఇక యూత్ ని ఎవరు ఆపలేరు 

ఈ కేరళ షెడ్యూల్ అనుభవాలను రష్మిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో అవి కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రకృతి అందాలు, జలపాతాల మధ్య సాగిన ఈ ప్రయాణం తనకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవమని, అయితే శారీరకంగా ఈ యాక్షన్ సీన్ల కోసం తాను ఎంతో కష్టపడాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్‌కు పెద్దపీట వేస్తున్న 'మైసా' చిత్రం రష్మిక కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. గ్లామర్ ఇమేజ్‌ను పక్కనపెట్టి ఆమె చేస్తున్న ఈ వీరోచిత పోరాటం వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com