Home

»

Latest News

'బాహుబలి' తర్వాత మళ్లీ 'భీమ్లా నాయక్'కే..

Mar 2, 2022 5:17PM

పవన్‌ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహించిన చిత్రం 'భీమ్లానాయక్‌'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈచిత్రం గత వారం విడుదలై రికార్డ్‌ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ చిత్రం లో డ్యానియేల్‌ శేఖర్‌ పాత్రతో మెప్పించిన రానా సినిమా గురించి, ఆయన పాత్రకు వస్తున్న స్పందన గురించి బుధవారం  మీడియాతో మాట్లాడారు.

* కళ్యాణ్ గారి లాంటి పెద్ద స్టార్‌ వచ్చి ఇలాంటి జానర్‌ సినిమా ట్రై చేస్తున్నారంటే కొత్తగా, ఎగ్జైటింగ్‌గా అనిపించింది. త్రివిక్రమ్‌ గారు ఏం మాట్లాడినా చాలా విలువైన మాటలాగా ఉంటుంది. నాలెడ్జ్‌ ఉన్న వ్యకి, భాష సంస్కృతి మీద మంచి పట్టు వుంది. మామూలుగా ప్రతి సినిమాతోనూ నేను చాలా నేర్చుకుంటాను. ఈ సినిమాతో త్రివిక్రమ్‌, పవన్‌ వల్ల చాలా నేర్చుకున్నా. అంతకముందు పవన్‌ తో నాకు పెద్దగా పరిచయం లేదు. కలిసింది కూడా తక్కువే. ఈ సినిమా అనుకున్నాక ఆయన నాకు బాగా కనెక్ట్‌ అయిపోయారు. చాలా నిజాయతీ ఉన్న వ్యక్తి. 

* 'ఐరన్‌ మ్యాన్‌' సినిమాలో రాబర్డ్‌డౌనీ పాత్ర ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ నాకు. అందులో వాడు నచ్చని పనులు చేస్తాడు కానీ అవి మనకు నచ్చుతాయి. ఆ పాత్రకు డ్యాని పాత్ర సిమిలర్‌గా అనిపించింది. ఈ సినిమా అనుకోగానే డ్యాని పాత్రకు ఎవర్నీ అనుకోకపోతే నేనే చేస్తానని అడిగా. 

* నేను విభిన్న కథలు ఎంచుకుంటాననే టాక్‌ ఉంది. సినిమాలో మధ్యలో పాటలు, ఫైటులు ఎందుకు అనుకుంటాను. పాటలొస్తే కథ నుంచి బయటకు వచ్చేస్తాను. ఎందుకో వాటికి సింక్‌ అవ్వలేను. చాలామంది రకరకాల రీజన్‌లతో యాక్టర్లు అవుతారు. నేను యాక్టర్‌ అయింది విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలని. అలా ఉండడం కోసం నటనలో చాలా మెళకువలు తెలుసుకున్నా.

* అసలు హీరో అంటే ఏంటి? అనేది ఈ సినిమాతో నేర్చుకున్నా. మాస్‌ సినిమా చేయాలని అందరూ చెబుతుంటే ఎందుకా అనుకునేవాడిని. అవి సినిమాకు ఎంత అవసరమో పవన్‌ కల్యాణ్‌ని చూశాక తెలిసింది. అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ కల్ట్‌ సినిమా. దానిని ఈ తరహాకు మార్పులు చేయాలంటే నటించే హీరోను బట్టే ఉంటుంది. 

* సినిమా వాతావరణంలో పుట్టిన నాకు ఏం చేసినా కొత్తగా ఉండాలనుకుంటాను. అందరిలా ఉండకూడదు అనేది నా తత్వం. తెర మీద కొత్తదనం చూడటానికే నేను థియేటర్ కి వెళ్తాను. థియేటర్‌లో కొత్తగా చూసింది.. అంతకంటే కొత్తగా నేను చేయాలనుకుంటా. ఇప్పటి వరకూ అదే దారితో వెళ్తున్నా. ఈ కథ విన్న తర్వాత నా జోన్‌ సినిమా అనిపించింది. అయితే సినిమా చేసిన తర్వాత ఇంతకుమించి ముందుకు వెళ్లాలి అనిపించింది. నేను ఎప్పుడు సెలెక్టివ్‌గా ఉంటాను..సాహసాలు కూడా చేస్తాను. అయితే 'భీమ్లానాయక్‌' చేశాక హీరోయిజం అంటే ఏంటో తెలిసింది. 

* ఒక సినిమాను రీమేక్‌ చేయాలంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. దాని మీద నాకూ అవగాహన ఉంది. ఎందుకంటే మా చిన్నాన్న వెంకటేశ్‌ చాలా రీమేక్‌లు చేశారు. మార్పుల చర్చలు ఎలా ఉండాయో బాబాయ్‌ దగ్గర వినేవాడిని. ఈ సినిమా విషయంలో మాత్రం త్రివిక్రమ్‌ చాలా కష్టపడ్డారు ఒరిజినల్‌ ఫ్లేవర్‌ను చెడగొట్టకుండా ఉన్న కథని మన వాళ్లకు నచ్చేలా ఎలా తీయాలో అలా చేశారు. ఆ విషయంలో ఈ సినిమాకు త్రివిక్రమ్‌ వెన్నెముక అనే చెప్పాలి. కొన్ని సన్నివేశాలు ఒరిజినల్‌ను మరచిపోయేలా రాశారు. దానికి తగ్గట్టే సాగర్‌ తెరకెక్కించారు. 

* ఇద్దరు హీరోలు తెరపై కనిపిస్తే.. ఒకడు మంచోడు.. మరొకడు తాగుబోతు అయితే.. చెడ్డవాడే నచ్చుతాడు. ఇక్కడా అదే జరిగి ఉంటుంది. ఇందులో డామినేటింగ్‌ ఏమీలేదు. డ్యాని పాత్ర కోసం నేను పెద్దగా కసరత్తులు ఏమీ చేయలేదు. డ్యాని ఎలా ఉండాలో అలాగే ఉన్నా. పవన్‌కల్యాణ్‌గారు కూడా అంతే! సింపుల్‌గా ఆ పాత్ర ఎలా ఉంటుందో అలాగే సెట్‌ లో ఉండేవారు. 

* సాగర్‌ చాలా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌ పర్సన్‌. అతన్ని చూస్తే జెలసీ ఉంటుంది. ఒకేసారి పవన్‌కల్యాణ్‌లాంటి స్టార్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో పని చేసే అవకాశం అతనికి వచ్చింది. ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌లో ఎవరికి ఎంత అంటే చెప్పలేం. దర్శకుడిగా సాగర్‌ చేయాల్సింది చేశాడు., మాటలు, స్ర్కీన్‌ప్లే రైటర్‌గా త్రివిక్రమ్‌ చేసేది చేశారు. టీమ్‌ అందరి కృషితోనే మేం ఈ సక్సెస్‌ సాధించాం.

* నేను చేసిన డ్యాని పాత్ర చూసి నాన్న చాలా సంతృప్తి చెందానన్నారు. ఆయన అలా చెప్పడం చాలా అరుదుగా జరుగుతుంది. 'బాహుబలి' తర్వాత మళ్లీ ఈ సినిమాకే చాలా గొప్పగా చెప్పారు. ఏదో ఒక రోజు పాటలు, ఫైటులు లేకుండా టాకీతోనే సినిమా తీసి హిట్‌ కొడతా అని మా నాన్నతో చెబుతుంటా. అలాంటి ప్రయత్నం చేస్తా. ఇకపై అవుట్‌ అండ్‌ అవుట్‌ కమర్షియల్‌ సినిమాలు కూడా చేస్తాను. సోషల్‌ మీడియాలో దాని గురించే చర్చ నడుస్తోంది. అలాంటి చిత్రాలు చేయాలని నాకూ ఇప్పుడే తెలిసింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com