Home

»

Latest News

ప్రచారం కోసం కాదు, ప్రేమతో.. అభిమాని ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పిన రామ్ పోతినేని!

May 21, 2026

వెండితెరపై తనదైన ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో, డ్యాన్స్‌లతో అభిమానులను అలరించే టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని నిజజీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్నారు. సాధార‌ణం త‌న అభిమానిని క‌ల‌వ‌డానికి హీరోలు వెళ్లిన‌పుడు కొంత ఆర్భాటం ఉంటుంది. కానీ, రామ్ మాత్రం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నేరుగా ఒక వీరాభిమాని ఇంటికే వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

గత 18 సంవత్సరాలుగా 'ఫ్రెడ్రిచ్ అటాక్సియా' అనే అరుదైన నరాల బలహీనత వ్యాధితో పోరాడుతున్న ఓ అమ్మాయి.. రామ్ పోతినేనికి ఎంతటి వీరాభిమానో తెలుసుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శరీర కదలికలు, మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపే ఈ వ్యాధి వల్ల ఆమె ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ, తన అభిమాన హీరోను ఒక్కసారైనా చూడాలనేది ఆమె జీవితకాల కోరికగా మారింది. ఈ విషయం రామ్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు.

ఎలాంటి మీడియా హడావుడి లేకుండా, కేవలం ఆమెకు ఆనందాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో రామ్ నేరుగా ఆ యువతి ఇంటికి వెళ్లారు. ఆమెను ఎంతో ఆప్యాయంగా పలకరించి, పక్కన కూర్చుని మాట్లాడి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. అంతేకాదు, ఆమె కుటుంబ సభ్యులతో కూడా కాసేపు సరదాగా సమయం గడిపారు. తన కళ్లముందు ఉన్నది నిజంగా రామ్ పోతినేనినే అని నమ్మలేక ఆ అభిమాని, ఆమె కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఆమెతో కలిసి రామ్ ఎంతో చిరునవ్వుతో ఫొటోలు దిగారు.

ఈ హృదయపూర్వక సంఘటనకు సంబంధించిన విజువల్స్ నెట్టింట ప్రత్యక్షమవడంతో అభిమానులు, నెటిజన్లు రామ్ పెద్ద మనసుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. "స్టార్డమ్ ఉన్నా ఇంతటి మానవత్వం చాటుకోవడం అరుదు", "నువ్వు నిజమైన హీరో అన్నయ్య" అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రచారం కోసం కాకుండా ఒకరి ముఖంలో సంతోషం చూడటం కోసం రామ్ చేసిన ఈ ప్రయత్నం అందరి హృదయాలను గెలుచుకుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే, రామ్ పోతినేని తన కెరీర్‌లో సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. ఆయన కథానాయకుడిగా నటిస్తూ, స్వయంగా మెగాఫోన్ పడుతున్న క్రేజీ ప్రాజెక్ట్ '#RAPO23'. 'ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వోల్ఫ్' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఒకవైపు డైరెక్టర్‌గా బిజీగా ఉంటూనే, అభిమాని కోసం సమయం కేటాయించిన రామ్ నడవడిక ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com