'నల్ల బల్లి' గిల్లుడు ఆపని ఆర్జీవీ!
on Oct 23, 2021
వివాదాస్పద సినిమాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. 'కొండా' సినిమా విషయంలో తెలంగాణ మంత్రిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు కొండా మురళి జీవితం ఆధారంగా 'కొండా' అనే సినిమాను ఆర్జీవీ తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను ఆపడానికి నల్ల బల్లి సుధాకర్ ప్రయత్నిస్తున్నాడని ఇటీవల చెప్పిన ఆర్జీవీ.. తాజాగా కొండా మురళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కూడా నల్ల బల్లి సుధాకర్ పేరు ప్రస్తావించారు.
"పిచ్చిపిచ్చి ప్రయత్నాలతో కొండా సినిమా షూటింగ్ ఆపలేరని నల్ల బల్లి సుధాకర్ తెలుసుకోవాలి" అంటూ ఇటీవల ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆర్జీవీ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. నేడు(అక్టోబర్ 23) కొండా మురళి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పిన ఆర్జీవీ మరోసారి నల్ల బల్లి సుధాకర్ పేరు తీసుకొచ్చారు. "కొండా మురళి గారికి కొండా చిత్ర యూనిట్ నుంచి మరియు నల్ల బల్లి సుధాకర్ గారి నుంచి, జన్మదిన శుభాకాంక్షలు" అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. దీంతో ఆర్జీవీ నల్ల బల్లి గిల్లుడు ఇప్పట్లో ఆపేలా లేడుగా అంటూ సెటైర్స్ వినిపిస్తున్నాయి.
మరోవైపు కొండా మురళి పుట్టినరోజు సందర్భంగా ఆర్జీవీ షేర్ చేసిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. సింహం బొమ్మ ఉన్న టీషర్టును ధరించిన కొండా మురళికి.. పులి బొమ్మ ఉన్న టీషర్టును ధరించిన ఆర్జీవీ ఫ్లవర్ బోకే ఇస్తున్నట్లుగా ఆ ఫోటోలో ఉంది. ఆ ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసిన ఆర్జీవీ.. ఆ ఫోటోకి "శాంతికి చిహ్నం" అనే కాప్షన్ ను జోడించారు.