బన్నీకి చిన్ననాటి జ్ఞాపకాల్ని రుచి చూపించిన చరణ్
on Apr 8, 2020
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8. టాలీవుడ్లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని బెస్ట్ డాన్సర్స్‌లో ఒకడిగా పేరుపొందిన బన్నీ తన లేటెస్ట్ ఫిల్మ్ 'పుష్ప' ఫస్ట్ లుక్‌తో సోషల్ మీడియాలో ప్రభంజనమే సృష్టించాడు. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై దానికి వచ్చిన రెస్పాన్స్ అసాధారణం. ఈ స్పెషల్ డే సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలు, ఫ్యాన్స్ బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు. చిరంజీవి దగ్గర్నుంచి 'పుష్ప' హీరోయిన్ రష్మికా మందన్న వరకూ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఇక మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అయితే తమ చిన్నప్పటి ఫొటో ఒకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఇద్దరు బాగా చిన్నవాళ్లుగా ఉన్నప్పటి ఆ ఫొటోలో చరణ్‌కు బన్నీ కేక్ తినిపిస్తున్నాడు. ఈ సన్నివేశాన్ని మెగాస్టార్ చిరంజీవి అపురూపంగా చూస్తున్నారు. ఆ ఫొటోతో పాటు, "ఈ రోజు నీకు నేను కేక్ తినిపించాల్సింది. దానికి బదులుగా మన చిన్నతనం నుంచి ప్రియమైన జ్ఞాపకాల్ని తినిపిస్తున్నాను. ఇది నీకు గొప్ప పుట్టినరోజు కావాలి బంజూ.. గ్రేట్ పోస్టర్" అని రాసుకొచ్చాడు. అలా 'పుష్ప' మూవీలో బన్నీ లుక్‌నీ ప్రశంసించాడు. చరణ్ షేర్ చేసిన ఆ ఫొటో నెటిజన్లును అలరిస్తోంది.