
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులకు అదిరిపోయే వార్త. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచింది. తాజాగా ఈ సినిమా ఎడిటింగ్ వర్క్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
'పెద్ది' సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. 1980ల నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచగా.. తాజాగా సినిమా ఎడిటింగ్ లాక్ అయిందనే వార్త ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.
ఏ సినిమాకైనా ఎడిటింగ్ పూర్తవ్వడం అనేది కీలకమైన ఘట్టం. 'పెద్ది' చిత్రానికి సంబంధించి డైరెక్టర్ బుచ్చిబాబు, ఎడిటర్ నవీన్ నూలి అవుట్‌పుట్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా నిడివి, సీన్ల ఫ్లో అద్భుతంగా కుదిరిందని టాక్. ఇక కేవలం వీఎఫ్ఎక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని సమాచారం. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం.
చిత్ర యూనిట్ ప్రకటించిన ప్రకారం, జూన్ 4న 'పెద్ది' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అంతకంటే ఒకరోజు ముందు అంటే జూన్ 3న ఓవర్సీస్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భారీ స్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సమ్మర్ ఎండింగ్‌లో చరణ్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం చరణ్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పక్కా లోకల్ కథను గ్లోబల్ స్థాయిలో ప్రెజెంట్ చేస్తున్న బుచ్చిబాబు, 'పెద్ది'తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.






