
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న 'ఇరుముడి' సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యామియో రోల్‌లో కనిపించబోతున్నారంటూ నెట్టింట ఒక రేంజ్ వార్తలు వైరల్ అయ్యాయి. 'మల్లెపూల పల్లకి' పాటలో చరణ్ గ్రాండ్ ఎంట్రీ ఉండబోతోందంటూ మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అసలు ఈ ప్రచారంపై తాజాగా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు.
రామ్ చరణ్ ప్రతి ఏటా ఎంతో నిష్టగా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు. ఆయనలోని ఆ దైవభక్తి, ఆ ఆధ్యాత్మిక వైబ్స్ అందరికీ తెలిసిందే. మరోవైపు 'ఇరుముడి' సినిమా కూడా అయ్యప్ప స్వామి దీక్ష, ఆ పవిత్రమైన మాల నేపథ్యంతో ముడిపడి ఉంది. దాంతో అభిమానులు ఈ సినిమాలో రామ్ చరణ్‌ను కూడా చూస్తే బాగుంటుందని ఊహించుకుని, ఆయనే క్యామియో ఇస్తున్నారంటూ రూమర్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు.
ఈ వార్తలపై దర్శకుడు శివ నిర్వాణ స్పందిస్తూ... "రామ్ చరణ్ గారు 'ఇరుముడి' సినిమాలో కనిపిస్తారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు" అని చెప్పారు. "రామ్ చరణ్ గారు గొప్ప అయ్యప్ప భక్తుడు. ఆయనలో ఉన్న ఆ డివైన్ వైబ్స్ వల్ల అభిమానులు ఆయన్ని ఈ సినిమాలో చూడాలని ఆశపడి ఉండవచ్చు, అందుకే ఇలాంటి వార్తలు వచ్చాయి. కానీ చరణ్ గారు ఈ సినిమాలో నటించడం లేదు.. అయితే మా సినిమాను చరణ్ గారు చూసి మెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని శివ నిర్వాణ వెల్లడించారు.
ఇక సినిమా విషయానికొస్తే.. ఈ ఆగష్టు 21న విడుదల కాబోతున్న 'ఇరుముడి' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అయ్యప్ప స్వామి మాల, ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు ఒక థ్రిల్లింగ్ క్రైమ్ యాంగిల్... ఇలా మూడు లేయర్స్‌లో కథ అద్భుతంగా సాగుతుందని చెప్పారు. "ఒక స్టార్ హీరో అయ్యప్ప మాలలో క్రైమ్ అండ్ ఫ్యామిలీ కథ చేస్తే ఆ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో థియేటర్లలో చూస్తారు. ఈ సినిమా కథ కోసమే నేను కూడా స్వయంగా అయ్యప్ప మాల ధరించాను" అని శివ నిర్వాణ తెలిపారు.
Ram Charan, Irumudi Movie, Ravi Teja, Shiva Nirvana






