Home

»

Latest News

ఆటోలో షూటింగ్ స్పాట్‌కు రజనీకాంత్.. తలైవా సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా!

Sep 30, 2026 7:36PM

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడ కనిపించినా అభిమానులు భారీగా తరలివస్తుంటారు. అయితే ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ సాధారణంగా ఉండటానికి ఇష్టపడే రజనీకాంత్ మరోసారి తన సింప్లిసిటీతో అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా తన సినిమా షూటింగ్ కోసం ఏకంగా ఆటోలో స్పాట్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రజనీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధర్మన్’ సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో పాల్గొనేందుకు రజనీకాంత్ ఆటోలో అక్కడికి వచ్చారు. మెరూన్ రంగు షర్ట్, పంచె ధరించిన ఆయన ఆటో నుంచి దిగగానే బయట వేచి ఉన్న అభిమానులకు చేతులు జోడించి నమస్కరించారు. అనంతరం వారిని పలకరిస్తూ షూటింగ్ సెట్‌లోకి వెళ్లారు. రజనీకాంత్ వస్తున్నాడని తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.

అయితే సెట్‌లోకి వెళ్లిన తర్వాత కూడా అభిమానుల కోసం తలైవా మరోసారి బయటకు వచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది గేటు మూసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బయట నుంచి అభిమానుల నినాదాలు వినిపించడంతో రజనీకాంత్ వారిని పలకరించారు. దీంతో అభిమానులు మరింత ఉత్సాహంగా నినాదాలు చేశారు. షూటింగ్ స్పాట్‌కు రజనీకాంత్ ఆటోలో రావడం, అభిమానులను ఆప్యాయంగా పలకరించడం వంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ‘ధర్మన్’ విషయానికొస్తే.. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రజనీకాంత్ ఇందులో డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ద్వారా తెలుస్తోంది. సిమ్రాన్, రాశీ ఖన్నా, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైసూరులో సినిమా మూడో షెడ్యూల్ కూడా పూర్తయినట్లు సమాచారం.

 

 

[Rajinikanth, Rajinikanth Auto Video, Rajinikanth Dharman, Dharman Movie, Rajinikanth Viral Video, Rajinikanth Simplicity, Ashwath Marimuthu, Kamal Haasan, Raashii Khanna, Rajinikanth Latest News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com