
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రతిష్టాత్మక 173వ చిత్రం (Thalaivar 173) చుట్టూ తిరుగుతున్న దర్శకుల మార్పుల సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడినట్లు కనిపిస్తోంది. ప్రముఖ స్టార్ హీరో లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan)కు చెందిన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఒక అదిరిపోయే బర్త్‌డే గ్లింప్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు హ్యాండిల్ చేయబోతున్నారంటూ నెట్టింట గత కొన్ని వారాలుగా జరుగుతున్న ప్రచారానికి బలాన్ని చేకూరుస్తూ, ఆ నిర్మాణ సంస్థ వదిలిన హై-ఎనర్జీ ప్రోమో మెగా అప్‌డేట్‌కు స్పష్టమైన సంకేతంగా నిలిచింది. 'హ్యాపీ బర్త్‌డే అశ్వత్ మారిముత్తు' అంటూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
'ఓ మై కడవులే', 'డ్రాగన్' వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తుకు ఈ బర్త్‌డే గ్లింప్స్ ద్వారా RKFI సంస్థ ఘనమైన శుభాకాంక్షలు తెలిపింది. ఈ స్పెషల్ ట్రిబ్యూట్ వీడియోను చూసిన సూపర్ స్టార్ అభిమానులు, ఇది కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలు మాత్రమే కాదని, తలైవర్ 173 ప్రాజెక్ట్‌కు ఆయనే దర్శకుడంటూ అఫీషియల్‌గా ఇచ్చిన హింట్ అని బలంగా నమ్ముతున్నారు.
గతంలో ఈ ప్రాజెక్ట్‌ను ముందుగా సీనియర్ దర్శకుడు సుందర్ సి టేకాఫ్ చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత 'డాన్' చిత్ర దర్శకుడు సిబి చక్రవర్తి చేతుల్లోకి ఈ భారీ సినిమా వెళ్లినట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. అయితే అనూహ్యంగా సిబి చక్రవర్తి కూడా ఈ మెగా ప్రాజెక్ట్ నుండి వైదొలగడంతో ఈ 173వ చిత్రానికి కొత్త కెప్టెన్ ఎవరు అనే సందిగ్ధత నెలకొంది.
ఇలాంటి ఉత్కంఠభరితమైన పరిస్థితుల మధ్య, అశ్వత్ మారిముత్తు పేరు తెరపైకి రావడం, దానికి తగ్గట్టుగానే నిర్మాణ సంస్థ నుండి అఫీషియల్ విజువల్ ట్రిబ్యూట్ రావడం కోలీవుడ్‌లో కొత్త జోష్ నింపింది. ఈ ప్రత్యేక వీడియోపై దర్శకుడు అశ్వత్ స్పందిస్తూ సదరు నిర్మాణ సంస్థకు ఫైర్ ఎమోజీలతో తన కృతజ్ఞతలు తెలియజేయడం విశేషం.






