టాలీవుడ్, కోలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు సరికొత్త ప్రయాణానికి సిద్ధమయ్యారు. గత కొన్ని రోజులుగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ లారెన్స్ ఒక అధికారిక ప్రకటన చేశారు. సోషల్ మీడియా వేదికగా దాదాపు 18 నిమిషాల సుదీర్ఘ వీడియోను పంచుకుంటూ, తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆయన పూర్తిగా ప్రజల, అభిమానుల చేతుల్లోనే పెట్టడం విశేషం.
ఈ వీడియోలో లారెన్స్ తన రాజకీయ ఆలోచనల వెనుక ఉన్న అసలు ఫ్లాష్‌బ్యాక్‌ను బయటపెట్టారు. 2017 జల్లికట్టు ఉద్యమం సమయం నుంచే రాజకీయం తన జీవితంలోకి వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత తన గురువు, తండ్రితో సమానమైన సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు ఆయనకు అండగా నిలబడ్డానని చెప్పారు. కానీ, రజనీ ఆరోగ్య కారణాల వల్ల వెనక్కి తగ్గడంతో లారెన్స్ కూడా సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితులు తనను ఈ నిర్ణయం వైపు నడిపించాయని లారెన్స్ పేర్కొన్నారు.
రాజకీయాల్లోకి రావడం లారెన్స్ తల్లికి అస్సలు ఇష్టం లేదట. పాలిటిక్స్ అనేది కులాలు, మతాలు, డబ్బుతో కూడిన ఒక 'మురికికూపం' అని ఆమె లారెన్స్‌ను వారించినట్లు తెలిపారు. కానీ, లారెన్స్ ప్రాణ స్నేహితుడు, నటుడు విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి ముఖ్యమంత్రి కావడంతో ఆమె ఆలోచన మారింది. ఎలాంటి డబ్బు, కులం సాయం లేకుండా కేవలం నమ్మకంతోనే విజయ్ గెలిచాడని, మంచి వాళ్లు కూడా రాజకీయాల్లోకి రావచ్చని లారెన్స్ తన తల్లిని ఒప్పించి, ఆమె ఆశీస్సులు తీసుకున్నారు.
సేవా కార్యక్రమాలతో ఎంతోమంది వికలాంగులను, పేద పిల్లలను ఆదుకుంటున్న లారెన్స్.. తనకు పదవులపై వ్యామోహం లేదని స్పష్టం చేశారు. "నాకు పెద్దగా చదువు రాదు, అందుకే మంత్రి పదవులపై ఆశ లేదు. నా ట్రస్ట్‌ను మరింత విస్తృతం చేసి, సమాజానికి పెద్ద ఎత్తున సేవ చేయడమే నా లక్ష్యం" అని లారెన్స్ వివరించారు. ఈ క్రమంలోనే నెటిజన్లకు ఒక ప్రశ్న వదిలారు. ఒకవేళ ప్రజలు 'నో' అంటే తాను రాజకీయాల్లోకి రానని, ఒకవేళ 'యస్' అంటే మాత్రం ఖచ్చితంగా బరిలోకి దిగుతానని, మీ కామెంట్ల ద్వారా మీ అభిప్రాయాన్ని చెప్పాలని కోరారు.
ప్రస్తుతం కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ తరపున లారెన్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. విజయ్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ప్రతిష్టాత్మక 'తిరుచిరాపల్లి (త్రిచి) ఈస్ట్' నియోజకవర్గం ఉప ఎన్నికల్లో TVK అభ్యర్థిగా లారెన్స్ బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సమర్పణలో వస్తున్న బెంజ్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన లారెన్స్, ప్రజల నుండి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి తన తదుపరి పొలిటికల్ యాక్షన్ ప్లాన్‌ను, పార్టీ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.





